అయోధ్య తీర్పుపై రివ్యూకే 99% ముస్లింల ఓటు

లక్నో: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై దేశంలోని 99 శాతం మంది ముస్లింలు అసంతృప్తిగానే ఉన్నారని ఆల్​ఇండియా ముస్లిం పర్సనల్​ లా బోర్డు(ఏఐఎంపీఎల్​బీ) పేర్కొంది. తీర్పుపై రివ్యూ కోరాలని వారంతా భావిస్తున్నారని ఆదివారం వెల్లడించింది. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉంది కాబట్టే రివ్యూ పిటిషన్​దాఖలు చేస్తామని ఏఐఎంపీఎల్​బీ జనరల్​ సెక్రెటరీ మౌలానా వలి రహ్మానీ చెప్పారు. గత నెలలో జరిగిన బోర్డు సమావేశంలో రివ్యూ కోరాలని నిర్ణయించామని, డిసెంబర్​ 9న పిటిషన్​ వేస్తామని అప్పుడే చెప్పామని తెలిపారు. అయితే, తమ పిటిషన్​ను కోర్టు పరిశీలనకు తీసుకోదేమోనని అంటూనే..రహ్మానీ దానర్థం పిటిషన్​ దాఖలు చేయొద్దని కాదన్నారు. తీర్పులో పలు వివాదాస్పద అంశాలను పరిశీలించాలని కోరేందుకే పిటిషన్​ వేయనున్నట్లు ఆయన వివరించారు. దశాబ్దాల తరబడి సాగుతున్న అయోధ్య వివాదం సుప్రీం తీర్పు తర్వాత కూడా ముగింపు దొరకకపోతే, పరిష్కారం ఏమిటని ప్రశ్నించగా.. ‘మసీదు నిర్మాణంలో ఎలాంటి ఆసక్తి లేని ముస్లింలు, భయంతో బతికే వాళ్లే ఈ తీర్పును పరిష్కారంగా భావిస్తున్నారని రహ్మానీ చెప్పారు.

Latest Updates