తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

a-3yr-girl-diedoff-her-fathers-tractor

కరీంనగర్ : తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి కన్న బిడ్డనే బలైన సంఘటన కరీంనగర్ జిల్లా చెర్లబూత్కూర్‌ గ్రామంలో జరిగింది. అప్పటివరకు చిరు నవ్వులు నవ్వుతూ..తల్లిచేత గోరుముద్దలు తిన్న చిన్నారి..కొన్ని క్షణాల్లోనే మృత్యువాత పడింది. తండ్రి నడుపుతున్న ట్రాక్టరే ఆయన గారాలపట్టి పాలిట మృత్యువాహనమైంది. జక్కు ప్రసాద్ అనే వ్యక్తి ఇంటి ముందున్న తన ట్రాక్టర్‌ను వెనక్కి తీస్తున్న సమయంలో ఆయన మూడేళ్ల కుమార్తె రితిక ట్రాక్టర్‌ చక్రాల కిందపడి నలిగిపోయింది.

తల్లి అన్నం తినిపిస్తుండగా రితిక ఇంటిముందు ఆడుకుంటోంది. గిన్నెలో అన్నం పూర్తికాగా.. మరింత పెట్టుకొని వచ్చేందుకు తల్లి ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలోనే తండ్రి ట్రాక్టర్‌ను వెనక్కి తీస్తుండటాన్ని గమనించిన రితిక.. ఆ వైపుగా వెళ్లి ట్రాక్టర్‌ కింద పడింది. పాప అరుపులు విని ప్రసాద్‌ ట్రాక్టర్‌ ఆపి పాపను హస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చిన్నారి ప్రాణాలు విడిచింది. చేతులారా తమ బిడ్డను పొట్టనపెట్టుకున్నామని కన్నీరుమున్నీరయ్యారు చిన్నారి తల్లిదండ్రులు. ‌

Latest Updates