పోలీసులు, వైద్య సిబ్బందికి అర‌టిపళ్లు, మ‌జ్జిగ పంపిణీ‌ చేసిన యాచకురాలు

భిక్షాటన చేస్తూ కూడబెట్టిన సొమ్ముతో.. పోలీసులకు, వైద్య సిబ్బందికి అరటిపళ్ళు, మజ్జిగ పంపిణీ చేసింది ఓ యాచకురాలు. లాక్ డౌన్ కార‌ణంగా భార్యా బిడ్డలను వదిలేసి ప్రజల బాగు కోసం‌ కష్టపడుతున్న వారి కోసం ఎంత చేసినా తక్కువేనంటోంది.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పిలుపు మేర‌కు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో కూడా వైద్య సిబ్బంది, పోలీసులు, పంచాయతీ కార్మికులు ప్రాణాల‌కు తెగించి అహర్నిశలు కష్ట పడుతున్నారు. వారు చేస్తున్న సేవలను చూసి తన వంతు సాయాన్ని అందించాలి అనుకొంది దుర్గా భవాని అనే యాచకురాలు. పక్షవాతం వచ్చి రెండు కాళ్లు చచ్చుబడిపోయి, మాట కూడా సరిగా రాని ఆ మ‌హిళ‌.. ప్రతిరోజు రోడ్డుపై భిక్షాటన చేసేది. రోడ్డుపై వెళ్లేవారు వేసే భిక్షంతో క‌డుపు నింపుకునేది. లాక్ డౌన్ కార‌ణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో అడుక్కులేక ఇబ్బంది ప‌డుతున్న ఆమెకు పవన్ కళ్యాణ్ సేవాసమితి సభ్యులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం భోజనాన్ని ఏర్పాటు చేసి ఆదుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తాను కూడా ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్న పోలీసుల‌కు చేత‌నైన సాయం చేయాల‌ని, మంగళవారం కొందరు యువకుల సహాయంతో ఆటోలు మాట్లాడి తన రెండు నెలల పెన్షన్ డబ్బులను, భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులు.. మొత్తం ఆరు వేల రూపాయలను వెచ్చించి అరటిపళ్ళు, మజ్జిగను వారంద‌రికీ తానే స్వయంగా అందించింది . దీంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్ర‌జ‌ల కోసం క‌ష్ట‌ప‌డుతున్న వైద్య సిబ్బంది, పోలీసుల కోసం మనం ఎంత చేసినా తక్కువేనని, దయచేసి కరోనా మహమ్మారి నిర్మూలన జరిగేంత వరకూ ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరింది.

Latest Updates