బెంగళూరులో తొలి కరోనా కేసు: రేపటి నుంచి స్కూళ్ల మూసివేత

కర్ణాటక రాజధాని బెంగళూరులో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. బెంగళూరు సిటీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా వచ్చినట్లు ఆ రాష్ట్ర మంత్రి కె.సుధాకర్ సోమవారం సాయంత్రం ప్రకటించారు. ఆమెరికాకు వెళ్లి వచ్చిన అతడికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచామన్నారు. అతడి శాంపిల్స్ టెస్టు చేయగా.. పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, పేషెంట్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో రేపటి (మంగళవారం) నుంచి సిటీలో అన్ని ప్రాథమిక పాఠశాలన్ని మూసేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్కూళ్లు తెరవొద్దని ఆయన సూచించారు.

అమెరికా నుంచి దుబాయ్ మీదుగా ఆ పేషెంట్ మార్చి 1న బెంగళూరు వచ్చాడని, మార్చి 5న కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రికి వచ్చాడని మంత్రి సుధాకర్ చెప్పారు. తొలుత రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్‌ ఓపీ విభాగంలో చికిత్స పొందిన అతడు 8న అడ్మిట్ అయ్యాడన్నారు. టెస్టుల్లో కరోనా ఉందని తేలడంతో ఇవాళ తేలిందన్నారు మంత్రి సుధాకర్. దీంతో అతడి భార్య, బిడ్డలను కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ వార్డులో క్వారంటైన్ చేసినట్లు తెలిపారు. అలాగే అతడితో పాటు అమెరికా వెళ్లిన ఉద్యోగినీ క్వారంటైన్ చేశామన్నారు. వీరందరినీ బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

పంజాబ్‌లోనూ ఒకరికి కరోనా

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోనూ ఒకరి కరోనా సోకింది. అతడు ఇటలీ నుంచి వచ్చాడని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అనురాగ్ అగర్వాల్ చెప్పారు. అతడికి కరోనా లక్షణాలు ఉండడంతో మూడ్రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడని తెలిపారు. శాంపిల్స్ పుణేకి పంపగా.. పాజిటివ్ అని సోమవారం రిజల్స్ వచ్చిందని చెప్పారు. అతడితో పాటు ఇద్దరు కుటుంబసభ్యులు కూడా ఇటలీ వెళ్లి వచ్చారని వారిని కూడా క్వారంటైన్ చేశామని తెలిపారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45కు చేరింది. వారిలో కేరళకు సంబంధించిన తొలి ముగ్గురు పేషెంట్లు పూర్తిగా నయమై డిశ్చార్జ్ అయ్యారు.

చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 90కి పైగా  దేశాల్లో లక్షా పది వేల మందికి వైరస్ సోకింది.  దాదాపు 3800 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చైనాలోనే దాదాపు 3 వేల మంది మరణించగా.. చికిత్స పొందుతున్న పేషెంట్ల సంఖ్య 90 వేల వరకు ఉంది. ఇక అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 30 రాష్ట్రాలకు వైరస్ వ్యాప్తించింది. అక్కడ 21 మంది మరణించారు. దాదాపు 500 మందికి పైగా కరోనా వైరస్ సోకింది. ఇటలీలో దాదాపు 7 వేల మందికి కరోనా సోకింది. ఆ దేశంలో ఇప్పటి వరకు వైరస్ సోకి 366 మంది మరణించారు.

Latest Updates