మాటలతో యువకులకు గాలం.. తర్వాత బ్లాక్ మెయిల్

మాటలతో గాలం వేస్తూ యువకులతో ఫ్రెండ్‌ షిప్‌,  క్లోజ్‌ అయ్యాక బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు లేడీ ఇప్పటి వరకు సిటీలోని పలు పోలీస్ స్టేషన్లలో 25 మంది యువకులను బ్లాక్‌మెయిల్​ చేసి కేసులు పెట్టింది. కలిసి ఉన్న ఫొటోలను, ఫోన్‌లో మాట్లాడిన వివరాలను బయటపెడతానని బెదిరించి మోసగిస్తూ ఉండేది. ఓ బాధితుడు కొద్దిరోజుల కిందట అబిడ్స్‌ పోలీసులకు కంప్లయింట్‌ చేయగా శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

అబిడ్స్,వెలుగు:  యువకులను మాయమాటలతో ట్రాప్ చేసి వారితో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత డబ్బుల కోసం వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కిలాడీ యువతిని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్ సీఐ రవికుమార్ కథనం ప్రకారం..మలక్ పేటకి చెందిన షాదాన్ సుల్తానా నిజామీ(26) ఇటీవల ఎల్ఎల్ బీ పూర్తి చేసింది. షాదాన్ కి అబిడ్స్ లోని మైనారిటీ ఎడ్యుకేషన్ సంస్థలో కాంట్రాక్టు అసిస్టెంట్ సూపర్‌‌వైజర్‌‌ రహీంతో 2015 లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారిద్దరూ తరచూ ఫోన్ లో మాట్లాడటం, బయటి ప్రదేశాలకు వెళ్లడం చేసేవారు. షాదాన్ డబ్బులు అవసరం ఉన్న సమయంలో అప్పుడప్పుడు రహీంని అడిగి తీసుకునేది. కొంతకాలం తర్వాత షాదాన్..రహీంని బ్లాక్ మెయిల్ చేయసాగింది. ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను బయటపెడతానని బెదిరించి డబ్బులు తీసుకునేది. 6 నెలల క్రితం రహీం దగ్గరి నుంచి రూ.3 లక్షలను షాదాన్ తన అకౌంట్ లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంది. ఆ తర్వాత మరోసారి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకపోతే తనను వేధిస్తున్నట్టు పీఎస్ లో కంప్లయింట్ చేస్తానని షాదాన్…రహీంను బెదిరించింది. దీంతో  రహీం అక్టోబర్ 19న అబిడ్స్ లోని తన ఆఫీసులో సమీపంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కంప్లయింట్ మేరకు షాదాన్ సుల్తానాను శుక్రవారం అరెస్ట్ చేసి  రిమాండ్ కు తరలించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. షాదాన్ సుల్తానా ఇదే తరహాలో పలువురు యువకులను ట్రాప్ చేసినట్లు రహీం తెలిపాడు. యువకులకు దగ్గరై డబ్బులు తీసుకొని తిరిగి వారిపైనే కేసులు పెట్టేదాని రహీం స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు. యువకులపై షాదాన్ కేసులు పెట్టి ఆ తర్వాత విత్ డ్రా చేసుకొనేందుకు డబ్బులు కూడా డిమాండ్ చేసేదన్నాడు.

విచారణలో వెలుగులోకి వచ్చిన నిజాలు

రహీం కంప్లయింట్ తో కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ ఎస్సై రాజు విచారణ చేపట్టారు. విచారణలో షాదాన్ సుల్తానా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. షాదాన్ ఇప్పటివరకు పలు పీఎస్ లలో 25 మంది యువకులను బ్లాక్ మెయిల్ చేసి వారిపై  కంప్లయింట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఓయూ పీఎస్ లో శిరీష అగర్వాల్, మలక్ పేట పీఎస్ లో సుజన్ ఖాన్ అనే తప్పుడు పేర్లతో యువకులపై కంప్లయింట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. యువకులను ట్రాప్ చేసి..వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న షాదాన్ ను అలాంటి పనులు చేయొద్దని గతంలో ఆమె తండ్రి తిట్టాడు. దీంతో షాదాన్ తనను తిడుతూ, వేధిస్తున్నాడని ఆమె తండ్రిపై కూడా చాదర్ ఘాట్ పీఎస్ లో కంప్లయింట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. షాదాన్ పై అంబర్ పేట, చిలకలగూడ, మలక్ పేట, ఉప్పల్ పీఎస్ లో కేసులు నమోదైనట్టు పోలీసుల విచారణలో తేలింది.  అబిడ్స్ పోలీసులు  షాదాన్ సుల్తానా పై ఐపీసీ 384 , 385 , 195(A) సెక్షలపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

 

Latest Updates