కాళేశ్వరంలో త్వరలో పడవ షికారు

గోదావరి బ్యాక్ వాటర్స్‌‌లో త్వరలో బోటింగ్
రెండు పడవలు ప్రారంభించనున్న టూరిజం శాఖ ప్రణాళికలు  రెడీ

కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్లు ఇక టూరిస్ట్​స్పాట్​లుగా మారనున్నాయి. ఆ ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ లో త్వరలో పడవ షికారు చేసే అవకాశమూ పర్యాటకులకు దక్కనుంది. కాళేశ్వరంతోపాటు ఆ ప్రాజెక్టు అనుబంధ పంప్‌‌హౌస్‌‌లు, రిజర్వాయర్లను టూరిస్ట్‌‌ స్పాట్లుగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణస్టేట్‌‌ టూరిజం డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌(టీఎస్‌‌టీడీసీ) అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ టూరిస్ట్‌‌ స్పాట్‌‌గా మారిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి బ్యాక్‌‌ వాటర్‌‌లో రెండు బోట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 బోటు షికారు.. జగిత్యాల టు ధర్మపురి

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం నుంచి జగిత్యాల జిల్లా ధర్మపురి వరకు సుమారు170 కిలోమీటర్ల మేరకు నీళ్లు నిలిచే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాగార్జున సాగర్‌‌ టు శ్రీశైలం తరహాలోనే కాళేశ్వరం టు ధర్మపురి బోటింగ్‌‌ సౌకర్యం కల్పించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు.

ప్రైవేట్ బోట్లకు నో  

నవంబర్‌‌ 2-017లో ఏపీలోని విజయవాడ వద్ద కృష్ణా నదిలో ప్రయాణిస్తున్న  ప్రైవేట్‌‌ బోటు బోల్తాపడి16 మంది టూరిస్టులు చనిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రైవేట్‌‌ బోట్ల నిర్వహణపై ఆంక్షలు విధించింది. టూరిస్ట్‌‌ స్పాట్లలో ప్రజలకు రక్షణ చర్యలు కల్పించాల్సిన  దృష్ట్యా ప్రైవేట్‌‌ బోట్లకు అనుమతులు ఇవ్వొద్దని, కేవలం టూరిజం డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో వాటర్ స్పోర్ట్స్‌‌కు, ఇతర ప్రైవేట్‌‌ బోట్లకు ఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేసింది. ఈ క్రమంలోనే టూరిజం అధికారులు కాళేశ్వరంలో తొలుత రెండు బోట్లు ఏర్పాటు చేయనున్నారు. టూరిస్టుల నుంచి వచ్చే డిమాండ్‌‌ను బట్టి వాటి సంఖ్యను పెంచుతామని ఆ శాఖ అధికారులు వెల్లడించారు.

టూరిస్ట్‌‌ స్పాట్లుగా బ్యారేజ్‌‌లు, రిజర్వాయర్లు

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా మేడిగ‌‌డ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌‌లు ఉన్నాయి. వీటితోపాటు కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌‌, బస్వాపూర్‌‌, అనంతగిరి, మేడారం తదితర19 రిజర్వాయర్లను కూడా టూరిస్ట్‌‌ స్పాట్‌‌లుగా అభివృద్ధి చేసేందుకు టీఎస్‌‌టీడీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. యాదాద్రికి సమీపంలోని బస్వాపూర్‌‌ రిజర్వాయర్‌‌ను మినీట్యాంక్ బండ్‌‌గా అభివృద్ధి చేయనున్నారు. రిజర్వాయర్‌‌లో బోటింగ్‌‌ సౌకార్యలు ఏర్పాటు చేయడంతోపాటు ఇక్కడ కాటేజీలు కూడా నిర్మించాలని భావిస్తున్నారు.

Latest Updates