వివాహేతర బంధం బయటపడిందని ఓ జంట ఆత్మహత్యాయత్నం

ప్రియుడు మృతి.. ఆస్పత్రిలో కోలుకున్న వివాహిత

చిత్తూరు: వివాహేతర సంబంధం బయటపడడంతో ఓ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. తమ బంధాన్ని వదులుకుని ఉండలేమనుకుని కలసి చనిపోదామని ప్రయత్నించారు. అయితే వివాహిత ప్రాణాపాయం నుంచి బయటపడగా.. ప్రియుడు కన్నుమూశాడు. తమిళనాడు సరిహద్దులోని తెల్లరాళ్ల పల్లె గ్రామంలో జరిగిన విషాద ఘటన స్థానికంగా సంచలనం రేపింది. గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ (22)కు అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల వివాహితతో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే సన్నిహిత సంబంధానికి దారితీసింది.వీరి వ్యవహారం భర్తకు తెలియడంతో మందలించాడు. అయినా వీరు ఒకర్ని విడిచి మరొకరు ఉండలేమనుకుని వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. వీరి తీరు మారకపోవడం గమనించిన వివాహిత భర్త తీవ్రంగా హెచ్చరించారు.

బెదిరిపోయిన వారిద్దరూ ఆదివారం మధ్యాహ్నం అదృశ్యమయ్యారు. దొరిరేవులల్లెకు సమీపంలో తమిళనాడు సరిహద్దులోని అటవీప్రాంతానికి వెళ్లి పురుగుల మందు తాగారు.  విషం తాగిన కొద్దిసేపటికే స్పృహ తప్పి పడిపోయారు. వివాహిత కోసం గాలిస్తూ బంధువులు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. వివాహితను చీలాపల్లె ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకుంది. దిలీప్ కుమార్ అప్పటికే చనిపోయి ఉండడంతో మృత దేహాన్ని చిత్తూరుకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం దిలీప్‌ మృతదేహాన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ నాగేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Latest Updates