‘దళిత మహిళే కదా అని రేప్ జరిగినా పట్టించుకోవట్లే’

  • దిశ ఘటనకు 4 రోజుల ముందే రేప్, మర్డర్
  • వివక్ష వల్లే పట్టించుకోవట్లే? మందకృష్ణ ఆరోపణ
  • నేడు ఆసిఫాబాద్​లో ధర్నాకు పిలుపు
  • న్యాయం కోసం 10 రోజులుగా నిరసనలు

హైదరాబాద్​లో దిశ ఘటనకు నాలుగు రోజుల ముందే ఆసిఫాబాద్​జిల్లాలో జరిగిన మరో ఘోరం ఇప్పడు కలకలం రేపుతోంది. దళిత మహిళను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారికి కఠిన శిక్షించాలంటూ 10 రోజులుగా జిల్లాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దళిత మహిళ కావడం వల్లే దీన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఆరోపించారు. మంగళవారం ఆయన జిల్లాలో పర్యటించి బాధిత కుటుంబీకులను పరామర్శించారు.

ఆసిఫాబాద్, వెలుగు: హైదరాబాద్​లో దిశ సంఘటన జరగడానికి నాలుగు రోజుల ముందే ఆసిఫాబాద్ ​జిల్లాలో జరిగిన మరో ఘోరం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఊరూరా తిరుగుతూ బుగ్గలు అమ్మి జీవించే దళిత మహిళను దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ సంఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కొన్ని రోజులుగా ప్రజా సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. వివక్ష కారణంగానే ప్రభుత్వం పట్టించుకోలేదని నేతలు విమర్శిస్తున్నారు. మంగళవారం ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆసిఫాబాద్ జిల్లా లింగపూర్ మండలంలో ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, దాడుల విషయంలో ప్రభుత్వం తీరు ఎస్సీలను చులకన చేసేవిధంగా ఉందని అన్నారు. కుమ్రం భీం బాధిత కుటుంబీకులు, స్థానికులతో ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారులో జరిగిన ఘటనలానే ఇదీ ఉందని, రాజధానిలో జరిగిన ఘటన పట్ల ఒక తీరుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మారుమూల ప్రాంతంలో జరిగిన అత్యాచార ఘటనను పూర్తిగా మరుగున పడేసిందని ఆరోపించారు. దిశ ఘటనకు నాలుగు రోజుల ముందే ఇక్కడ మహిళను అత్యాచారం చేసి హత్య చేశారని, ఈ ఘటనలో కూడా ముగ్గురు నిందితులు మద్యం తాగి విచక్షణరహితంగా వ్యవహరించారన్నారు. వెటర్నరీ డాక్టర్ విషయంలో ప్రభుత్వం, మీడియాతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించారని, అదే కుమ్రం భీం సంఘటన విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దళితుల పట్ల ప్రభుత్వం, అధికారుల వైఖరిని నిరసిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన దంపతులు జైనూర్​లో ఉంటూ గ్రామాల్లో తిరిగి పిల్లలకు బుగ్గలు అమ్ముతూ, వెంట్రుకలు కొంటూ బతుకు సాగిస్తున్నారు. గత నెల 24న భర్తతో కలిసి మహిళ లింగపూర్ మండలం ఎల్లపటార్ గ్రామానికి వెళ్లింది. భార్యను అక్కడ దించి భర్త మరో గ్రామానికి వెళ్లాడు. మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో ఎల్లపటార్​గ్రామానికి వచ్చి చూడగా భార్య కనిపించలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆందోళన చెందిన భర్త బంధువులతో కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి లింగపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 25వ తేదీన ఉదయం 9 గంటల ప్రాంతంలో రాంనాయక్ తండా-ఎల్లపటార్ గ్రామానికి వెళ్లే దారిలో చెట్ల పొదల్లో రక్తపుమడుగులో మహిళ శవం దొరికింది. సంఘటన స్థలంలో ఆధారాలను బట్టి అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

ముగ్గురు నిందితులు

రాంనాయక్​తండాకు చెందిన షేక్ బాబు(25), షేక్ షాబొద్దిన్(40), షేక్ మఖ్దుం(26) వ్యవసాయ కూలీలు. కర్రల స్మగ్లింగ్​చేస్తుంటారు. మహిళ హత్యకు గురైన తర్వాత వీరు ముగ్గురూ పరారయ్యారు. పోలీసుల విచారణ సందర్భంగా వీరు గ్రామంలో లేరని తెలియడంతో వారిపై అనుమానం వచ్చింది. నవంబర్ 26న ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ వద్ద ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు నిందితులను అదుపులోకి తీసుకుని ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణకు అప్పగించారు. నిందితులను విచారించిన పోలీసులు వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. 24న మహిళ ఒంటరిగా వస్తుండడం గమనించిన ముగ్గురూ బలవంతంగా చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం గొంతు కోసి హత్య చేశారని తేలింది.

కొనసాగుతున్న నిరసనలు

లింగపూర్​ఘటనపై జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ఎమ్మార్పీఎస్, బుడగ జంగం ఆధ్వర్యంలో ఆసిఫాబాద్​అంబేద్కర్​చౌక్​వద్ద రెండు రోజుల క్రితం రాస్తారోకో నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడేల్​ ఆధ్వర్యంలో కలెక్టర్​రాజీవ్​గాంధీ హనుమంతు, ఎస్పీ మల్లారెడ్డికి వినతిపత్రం అందించారు. సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్​సభ్యులు సి.నర్సింహ, పి నీలబాయి ఖానాపూర్​ మండలంలో పర్యటించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఉరి తీయాలంటూ మంగళవారం ఆదిలాబాద్​జిల్లా కేంద్రంలో మహిళలు, స్టూడెంట్, కుల సంఘాల ఆధ్వర్యంలో క్యాండిల్​ర్యాలీ నిర్వహించారు.

A Dalit woman has been raped and brutally murdered by three men 10 days back

Latest Updates