వ్యాక్సిన్​ వేసుకున్నోళ్ల చేతి వేలికి సిరా చుక్క

సెకండ్​ డోస్​ వేసేప్పుడు ఈజీ అవుతుంది: హెల్త్​ డైరెక్టర్​ 

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా టీకా తీసుకున్న ప్రతి ఒక్కరి ఎడమ చేతి బొటన వేలికి సిరా చుక్క పెట్టనున్నట్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌  డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఎన్నికల సందర్భంలో వాడే ప్రత్యేక ఇంక్​నే ఇందుకోసం వాడుతున్నట్టు వెల్లడించారు. శుక్రవారం కోఠీలోని కరోనా కంట్రల్‌‌ రూమ్‌‌లో డీఎంఈ రమేశ్‌‌రెడ్డితో కలిసి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని, రెండోసారి తీసుకున్నప్పుడు గుర్తించేందుకు వీలుగా ఇంక్‌‌ గుర్తు పెడుతున్నట్టు డీహెచ్ వివరించారు. వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. శనివారం ఉదయం పదిన్నరకు ప్రధాని మోడీ వర్చువల్‌‌గా టీకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. నిమ్స్‌‌లో గవర్నర్‌‌‌‌ తమిళిసై, గాంధీలో హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్‌‌‌‌, తిలక్‌‌నగర్ యూపీహెచ్‌‌సీలో మంత్రి కేటీఆర్‌‌‌‌ వ్యాక్సినేషన్‌‌ కార్యక్రమాలను పరిశీలిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 3.15 లక్షల మంది హెల్త్ కేర్ వర్కర్లు వ్యాక్సిన్ కోసం రిజిస్టర్​ చేసుకున్నారని, ఇందులో తొలుత ప్రభుత్వ హెల్త్​ స్టాఫ్​కు, అనంతరం ప్రైవేటు వారికి ఇస్తామన్నారు. వ్యాక్సిన్‌‌పై సోషల్‌‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని నెటిజన్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. కొవాగ్జిన్ తీసుకున్న వారిని వారం రోజులు అబ్జర్వ్ చేస్తామన్నారు. వ్యాక్సిన్ గురించి లేనిపోని అపోహలు సృష్టించొద్దని, అవసరమైతే తానే కొవాగ్జిన్ వేసుకుంటానని చెప్పారు. వ్యాక్సినేషన్ పూర్తిగా ‘కొవిన్‌‌’ సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ కేంద్రంగా నడుస్తోందన్నారు. టెక్నికల్ ఇష్యూస్‌‌ను దృష్టిలో పెట్టుకుని మాన్యువల్‌‌గా కూడా వ్యాక్సినేషన్ వివరాలను నమోదు చేస్తామని చెప్పారు.

ట్రీట్‌‌మెంట్‌‌కు 57 హాస్పిటళ్లు సిద్ధం

శనివారం తాను కూడా టీకా తీసుకుంటున్నానని డీఎంఈ రమేశ్​రెడ్డి వెల్లడించారు. వ్యాక్సిన్‌‌ తీసుకున్న తర్వాత జ్వరం, ఇంజక్షన్ వేసిన చోట నొప్పి, ఎర్రబడడం వంటివి సహజమేనన్నారు. వ్యాక్సిన్‌‌కు మన బాడీ రెస్పాండ్‌‌ అవుతోందని చెప్పేందుకు అవి గుర్తులని ఆయన వివరించారు. ఎలాంటి రియాక్షన్ వచ్చినా ట్రీట్‌‌మెంట్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం 57 హాస్పిటళ్లలో డాక్టర్లు సిద్ధంగా ఉంటారని చెప్పారు.

ఇవీ చదవండి

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

జూనియర్ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్‌ నెంబర్-2

నెట్ బౌలర్‌గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం

లాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే ఇలా చేయాల్సిందే!

Latest Updates