ప్రభుత్వాలు చేయవని.. సొంతంగా వంతెన కట్టుకున్నాడు

మధ్యప్రదేశ్ లో ఓ రైతు ప్రభుత్వాలు, అధికారుల పనితీరుపై నిరసన తెలిపాడు. ఏళ్లుగా వానాకాలంలో ఏరు దాటేందుకు తాము ఇబ్బంది పడుతున్నా ఏ నాయకుడూ తమను పట్టించుకోలేదని.. తానే ఆ పనిని పూర్తిచేశాడు.

ఈ రైతు పేరు శివప్రసాద్. సాగర్ జిల్లా సామ్నాపూర్ కుగ్రామంలో ఉంటున్నాడు. వానాకాలం వచ్చిందంటే.. ఈ గ్రామస్తులకు ఏటి కష్టాలు మొదలవుతాయి. స్థానికుల ఇబ్బంది తొలగించేందుకు తన రెక్కల కష్టాన్నే నమ్ముకున్నాడు ఆ రైతు. ఆ కొస నుంచి.. ఈ కొస వరకు… కర్రలు పాతి.. వాటిపై మనుషులు దాటేలా.. ఓ చిన్న వంతెన నిర్మించాడు. నీళ్లలోంచి దిగకుండా.. బురదలోంచి ఈడ్చుకుంటూ వెళ్లకుండా ఉండేలా.. ఈ సౌకర్యాన్ని సొంతంగా కల్పించుకున్నాడు.దీనిమీదుగానే తన కుటుంబం… గ్రామస్తులు ఏరుదాటుతున్నారని చెప్పాడు ఆ రైతు.

నీళ్లను దాటేందుకు స్థానికులు పడుతున్న కష్టాలు చూసినా కూడా..  స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలకు పట్టింపు లేకుండా పోయిందని చెప్పాడు రైతు శివప్రసాద్. మళ్లీ మళ్లీ వాళ్లను కలవడం వృథా అని.. అందుకే తానే ఇలా కట్టెలతో చిన్న వంతెనను నిర్మించానని చెప్పాడు.

Latest Updates