ఇచ్చట పెండ్లి చూపులు.. ఓన్లీ రైతులకే!

పిల్లనడిగితే ‘గవర్నమెంట్ జాబు ఉన్నోళ్లకు ఇస్తం’ ఇది ఫస్ట్ మాట. ఇంక కొంచెం కిందికి దిగితే  ‘పిలగానికి పట్నం కొలువైనా లేకుంటే ఎట్ల?’ అంటరు.  ఈ కాలంల పెండ్లి సంబంధాలు చూసేటప్పుడు ఈ రెండు మాటలే ఫస్ట్ ఇనవడ్తయ్‌‌‌‌. మరి పిలగాడు ఊళ్లె ఉంటుండు, ఇల్లు జాగా మంచిగున్నయ్‌‌‌‌. ఎవుసం చేసుకుంట, పుట్లు పండిస్తుండు.  పిల్ల గావాలె’ అని అడిగితే..‘పొలం పని చేశి, చేశి మేం కష్టపడ్డది సాలాదా? ఇప్పుడు నా బిడ్డ కూడా కష్టపడాల్నా?’ అంటరు. చిన్న పని చేసినా.. సిటీల ఉండేటోళ్లకే ఇస్తున్నరు. రైతులకు పిల్లలిచ్చేటోళ్లు చానాతక్కువ. ‘అరె.. రైతుకేం తక్కువ? ఎవలిమీద ఆధారపడకుండ బతుకుతడు. రైతులకు పిల్లని ఎందుకియ్యరో చూస్త’ అని కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా, తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌లో ఉండే రైతు… ‘రైతు మ్యారేజ్ బ్యూరో’ పెట్టిండు. ‘వ్యవసాయం చేసే పిల్ల, పిలగానోళ్లే సంప్రదించాలె’ అని క్యాప్షన్ కూడా పెట్టిండు.

తిమ్మాపూర్, వెలుగు

రైతుకు పిల్లనియ్యాలె అంటే.. పిల్లోల్లు జర వెనకాముందు ఆడుతున్రు. అందుకే, రైతులకు పెండ్లి చేయాలనే ఉద్దేశంతో..  తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌లో ఉండే  కేతిరెడ్డి అంజిరెడ్డి అనే రైతు బాధ్యత తీసుకున్నడు. పేద కుటుంబం నుంచి వచ్చిన అంజిరెడ్డి మంచి పంటలు పండిస్తూ.. ఆదర్శ రైతుగా నిలదొక్కుకున్నడు. ‘రైతే రాజు’ అని, రైతు లేకుంటే మనకు మెతుకు లేదు, బతుకు లేదు అని గొప్ప మాటలు అయితే చెప్పుకుంటున్నరుగానీ, రైతుకి పిల్లనియ్యాలంటే మాత్రం ఎవలూ ముందుకొస్తలేరు. వేరే ఉద్యోగాలు ఉన్నోళ్లకు మాత్రం మంచిగ కట్నం ఇచ్చి పెండ్లిలు చేస్తున్నరు. దీంతో చానామంది రైతులకు ముప్పై ఏండ్లు వచ్చినా పెండ్లిండ్లు కావటం లేదు. ఇది అంజిరెడ్డి మనసును కలవరపెట్టింది. ఆ కలవరమే ‘రైతు మ్యారేజ్ బ్యూరో’ పెట్టేందుకు తొందర పెట్టింది.

రెండు రాష్ట్రాల రైతుల కోసం

రైతులకు పెండ్లి సంబంధాలు చూడటం తన బాధ్యతగా తీసుకున్నడు అంజిరెడ్డి. కేవలం కరీంనగర్ జిల్లా,  తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌‌‌‌ రైతులకు కూడా తన బ్యూరో ద్వారా పెండ్లి సంబంధాలు కుదురుస్తున్నడు. రైతు మ్యారేజ్‌‌‌‌ బ్యూరోకు మంచి రెస్పాన్స్​ వస్తుందని అంజిరెడ్డి చెప్పిండు. అంతేకాడు, పోయినవారంలనే దాదాపు వెయ్యి సంబంధాలు చూసిండట. మంచిరోజులు వచ్చినంక వీళ్లలో చానామందికి పెండ్లిలు అయ్యే అవకాశం ఉంది.

‘‘రైతుకు పిల్లని ఇయ్యాలె అనే పట్టుదలతో ఈ మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేసిన. ఐదు నుంచి పది ఎకరాల భూమి ఉన్న రైతు కుటుంబంలో వ్యవసాయం చేసుకునే పిలగానికి పిల్లను ఇయ్యడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ అవమానం నాకూ ఎదురైంది.   ఉద్యోగం ఉంటేనే పిల్లను ఇస్తం అనడం బాధ అనిపిచ్చింది. ఇలాంటి నమ్మకాల నుంచి మళ్లించి సొసైటీలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో.. రైతు మ్యారేజ్ బ్యూరో పెట్టిన. రైతు కుటుంబంలో ఉన్న పెండ్లికానోళ్లకు.. పెండ్లి సంబంధాలు చూస్తున్న. సంబంధాల కోసం వచ్చేటోళ్ల దగ్గర నుంచి ఎలాంటి డబ్బూ ఆశించడం లేదు. రిజిస్ట్రేషన్‌‌‌‌ ఫీజు కింద కేవలం ఐదొందల రూపాయలు తీసుకుంటున్న.  ఎలాంటి ఉద్యోగం లేని రైతు కుటుంబంలో కూడా పిల్లల్ని ఇయ్యాలనే ఆలోచన రావాలన్నది నా ఆశయం.’’

– కేతిరెడ్డి అంజిరెడ్డి, తిమ్మాపూర్

 

Latest Updates