దండకారణ్యంలో 56 గంటలు చిన్నారి నరకయాతన

నాలుగేళ్ల పాప.. దట్టమైన అడవిలో తప్పిపోయింది. గంటా రెండు గంటలు కాదు.. రెండున్నర రోజులు అడవిలోనే ఉంది.. రాత్రిళ్లు చిమ్మ చీకటి.. ఓ రోజు భారీ వర్షం.. చుట్టూ క్రూరమృగాలు.. ఆకలేస్తే విప్ప బద్దలు, లేత తునికాకులు తిన్నది. చివరికి స్పృహ తప్పిపడిపోయింది. 56 గంటల తర్వాత అడవిలోకి వచ్చిన కొందరి కంటబడడంతో తల్లిదండ్రుల చెంతకు చేరింది.

భద్రాచలం, వెలుగు:భద్రాచలం పక్కనే ఉన్న విలీన మండలం వీఆర్‍పురంలోని దర్భలంక గ్రామానికి చెందిన కుంజా సమృరామ్‍అనే వలస గిరిజనుడికి ఇద్దరు పిల్లలు. అందులో పెద్దపాప కుంజా మంజు(4). సోమవారం సమృరామ్‍భార్య నిత్యావసర వస్తువుల కోసం పెద్దమట్టపల్లి గ్రామానికి వెళ్లింది. ఆమె వెనకాలే పాప మంజు వచ్చిన సంగతి ఆ తల్లి గ్రహించలేకపోయింది. గ్రామం చుట్టూ అడవి. తల్లి నడకను అందుకోలేని పాప అడవిలో ఒంటరైంది. దారి తప్పి అడవిలోకి వెళ్లిపోయింది. ఇంటికి తిరిగొచ్చిన తల్లి పాప లేకపోవడం గుర్తించింది. చుట్టుపక్కల అటవీ ప్రాంతాలను జల్లెడ పట్టినా ప్రయోజనం లేకపోయింది. అభయారణ్య ప్రాంతం కావడంతో అడవి జంతువులు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో పాప తప్పిపోయిన సోమవారం రాత్రి అభయారణ్యంలో భయంకరమైన గాలివాన వచ్చింది. మంగళవారం కూడా చిన్నారి దొరకలేదు.

వేట కుక్కలు గుర్తించడంతో…

పాపికొండల అభయారణ్యంలో గుల్లేటివాడ గ్రామానికి చెందిన కొండరెడ్లు నలుగురు వెదురు కోసం బుధవారం వెళ్లారు. వారితో పాటు వేట కుక్కలు కూడా తీసుకెళ్లారు. వారి గ్రామానికి దాదాపు10 కి.మీ. దూరంలో దండకారణ్యంలో వెదురు నరుకుతుండగా కుక్కలు బిగ్గరగా అరుస్తున్నాయి. ఓ కొండరెడ్డి అలికిడి విని ఆ ప్రాంతానికి వెళ్లగా చిన్నారి కనిపించింది. కాకులు దూరని కారడవిలో చిన్నారి కన్పించడంతో పరిగెత్తుకుంటూ వెళ్లి మిగిలిన ముగ్గురిని తీసుకొచ్చాడు. అప్పటికే చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. అపస్మారక స్థితికి వెళ్తున్న మంజుకు తమ వెంట తెచ్చుకున్న గంజినీళ్లు తాగిపించారు. నీళ్లతో ముఖం కడిగి వెంటనే గ్రామానికి తీసుకొచ్చారు. వాంతులు చేసుకున్న చిన్నారి కడుపులోంచి విప్పబద్దలు, తునికాకులు బయటపడ్డాయి.  అప్పటికే ఈ ప్రాంతంలో పాప మిస్సింగ్‍సంచలనం రేకెత్తించడంతో పోలీసులు అడవిలో వెతుకులాట మొదలుపెట్టారు. ఈ లోపు గుల్లేటివాడ కొండరెడ్లు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని చిన్నారికి ట్రీట్​మెంట్​చేశారు. చిన్నారిని తల్లిదండ్రుల ఒడికి చేర్చారు.

మరిన్ని వార్తల కోసం

నెట్టింట్లో వైరల్ అవుతున్న సన్న పిన్ చార్జర్

Latest Updates