ఎంబీబీఎస్ సీటు పేరుతో రూ.15 లక్షలు టోకరా

ఎంబీబీఎస్  సీటు ఇస్తామని చెప్పి బాధితుల దగ్గర నుంచి ఆన్ లైన్ ద్వారా రూ.15 లక్షల వసూలు చేసిన ఘరానా దొంగలను కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. నాన్ సబ్సిడైస్డ్ కోటాలో మెడికల్ సీటు ఇప్పిస్తామని చెప్పి..  మచిలీపట్నంకు చెందిన కట్టా నాగమోహనరావు అనే వ్యక్తి దగ్గర లక్షల సొమ్ము వసూలు చేశారు. వారి చెప్పిన కాలేజీకి వెళ్లిన తర్వాత తాము మోసపోయామని గ్రహించిన నాగమోహనరావు, అతని కొడుకు ఆ కేటుగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చిలకలపూడి ఎ.ఎస్.పి.సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం….బీహార్ రాష్ట్రం అప్సర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఓంకార్ కుమార్, రాకేష్ కుమార్, రణధీర్ కుమార్ లు ఎంబీబీఎస్ సీటు ఇస్తామని చెప్పి మచిలీపట్నంకు చెందిన నాగమోహనరావును ఆన్ లైన్ ద్వారా మోసం చేశారు. ఆ ముగ్గురిలో ఒకరు పంకజ్ కుమార్ శర్మ పేరుతో.. ఫోన్ చేసి  తాను మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్లో డెప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్నట్టు నమ్మించాడు. నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో సీటు రాకపోతే ఎంబిబిఎస్ సీట్ ఇప్పిస్తానని నమ్మబలికారు. ఫోన్ ద్వారా ఎస్.ఎం.ఎస్ లు పంపారు. కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో నాన్ సబ్సిడైస్డ్ సీట్లలో ఒక సీటు కేటాయించినట్లు పత్రాలు కూడా పంపిణీ చేశారు. ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న మోహన్ రావు కొడుకును ఎంబీబీఎస్ చదివించాలనే ఆశతో వారి పంపిన మెసేజ్ లను, పత్రాలను నమ్మాడు. ఆ పంకజ్ కుమార్ అనబడే వ్యక్తి చెప్పినట్టుగా రూ.15లక్షలను దఫాల వారీగా ఆన్ లైన్ లో చెల్లించాడు.

డబ్బు కట్టిన తర్వాత కలకత్తాలో వారు చెప్పిన కాలేజీకి వెళ్లగానే.. వారు చెప్పిన ప్రకారం అక్కడ ఎలాంటి సీటు లేదని తెలుసుకున్నారు.  తాము మోసపోయామని గ్రహించి సెప్టెంబర్ నెలలో చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించిన తర్వాత  చిలకలపూడి SP  ఆదేశాల మేరకు…  సీఐ వెంకట నారాయణ, ఎస్.ఐ  శివరామకృష్ణ ల బృందాన్ని పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాకు పంపిచారు. ఆ బృందం అక్కడ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. వారు బీహార్ లో ఉన్నట్టు తెలిసింది. దీంతో బీహార్ లో వారి కోసం వెతికిన పోలీసుల టీమ్ కి అప్సర్ గ్రామ సమీపంలోని ఓ బస్టాండ్ సమీపంలో ఈ కేటుగాళ్లు పట్టుబడ్డారు.  నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకున్నందుకు ఏ.ఎస్.పి సత్తి బాబు, డి.ఎస్.పి  మెహబూబ్ బాషా వారిని అభినందించారు. సోషల్ మీడియా ద్వారా, ఆన్ లైన్ ద్వారా వచ్చే ఇలాంటి వార్తలను నమ్మవద్దని, డబ్బులు కట్టి మోసపోవద్దని ప్రజలకు ASP విన్నపం చేశారు.

 a gang of three arrested  for collected Rs 15 lakh, by offering victims an MBBS seat.

Latest Updates