మీ కోసం పోర్టల్ కు ఫుల్ గిరాకీ..10 రోజుల్లో 4,662 ఆర్డర్లు

సూర్యాపేట కలెక్టరేట్, వెలుగు: సూర్యాపేట మున్సిపల్ ఆఫీసర్లు రూపొందించిన ‘మీ కోసం’ పోర్టల్ కు మంచి స్పందన వస్తోంది. సూర్యాపేటలో కరోనా కేసులు భారీగా పెరగడంతో ఆఫీసర్లు పట్టణం మొత్తాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు బంద్ చేశారు. ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రజలకు అవసరమైన సరుకులు, వస్తువులు డోర్ డెలివరీ చేసేందుకు అధికారులు చర్యలు
తీసుకున్నారు.

రోజూ వందల్లో ఆర్డర్లు

రెడ్ జోన్ గా ఉన్న సూర్యాపేటలో లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తుండడంతో ప్రజలు పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, నిత్యావసరాల కోసం బయటకు రావాలన్నా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ‘మీ కోసం’ పోర్టల్ ను రూపొందించారు. దీని ద్వారా తమకు కావాల్సిన వస్తువులను ప్రజలు ఆర్డర్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో ఈ పోర్టల్ కు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన ఈ పోర్టల్ ద్వారా కేవలం పది రోజుల్లోనే వివిధ రకాల వస్తువులు కావాలంటూ 4,660 మంది ఆర్డర్లు పెట్టారు.

అందుబాటులో 9 రకాల సేవలు

ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ‘మీ కోసం’ పోర్టల్ లో మొత్తం 9 రకాల సేవలను అందుబాటులో ఉంచారు. ఇందులో ఆహారం, ఆశ్రయం, కిరాణ సరుకులు, ఎమర్జెన్సీ పాస్, పండ్లు, వీడియో, ఫోన్ కాల్ ద్వారా వైద్య సేవలు, మెడిసిన్స్ తో పాటు, ఎమర్జెన్సీ సమయంలో కావాల్సిన సహాయానికి సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచారు. బుక్ చేసిన 4 నుంచి 24 గంటల వ్యవధిలోనే ఆర్డర్లు డెలివరీ చేస్తున్నారు.

డెలివరీ కోసం ప్రత్యేక సిబ్బంది

ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డెలివరీ చేసేందుకు ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బందిని నియమించారు. జిల్లా కేంద్రంలోని హెరిటేజ్, మోర్ సూపర్ మార్కెట్ తో పాటు హోల్ వ్యాపారులతో కలిసి పనిచేస్తున్నారు. ఆర్డర్ చేసిన వారి సరుకుల లిస్ట్ ఆయా దుకాణాలకు ఇవ్వడంతో వారు వస్తువులను ప్యాకింగ్ చేసి డోర్ డెలివరీ చేస్తున్నారు.

ప్రజలు బయటకు  రాకుండా ఉండేందుకే..

సూర్యాపేట పట్టణంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు చేశాం. దీని ద్వారా వారికి కావాల్సిన వస్తువులను ఇండ్ల వద్దకే డెలివరీ చేస్తున్నాం. ఆర్డర్ చేసిన నాలుగు నుంచి 24 గంటల్లోపు డెలివరీ ఇస్తాం. ప్రజల నుంచి ఆర్డర్స్ భారీగానే వస్తున్నాయి.

– వినయ్ కృష్ణారెడ్డి, కలెక్టర్, సూర్యాపేట

 

Latest Updates