సారూ..నన్ను ఇండియాకు తీసుకుపోండి

జగిత్యాల క్రైం, వెలుగు: ‘కేసీఆర్​సారూ దండం పెడతా.. నన్ను ఇండియాకు తీసుకుపోండి. నాకు పానం బాగుంటట్లేదు.. కరోనా అన్నప్పటి నుంచి టెన్షన్​ఎక్కువైతాంది.. నన్ను బతికించండి’ అంటూ నెల క్రితం సోషల్​మీడియా ద్వారా వేడుకున్నాడా వ్యక్తి. రోజులు గడుస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల అర్బన్​ మండలం మోతె గ్రామానికి చెందిన రేగుంట రాము-, అంజలిలకు వైష్ణవి, అమూల్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేక రాము మూడేళ్ల క్రితం కువైట్​వెళ్లాడు. అక్కడ కారు డ్రైవర్​గా చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం సెలవుపై ఇంటికి వచ్చి వెళ్లాడు. మూడు నెలలుగా కరోనా వ్యాప్తి పెరుగుతుండడం, ప్రపంచవ్యాప్తంగా లాక్​ డౌన్​ చేయడంతో తన కుటుంబసభ్యులు ఎలా ఉన్నారో అని ఆందోళనకు గురవుతున్నాడు. ఇంటికి వెళదామంటే యజమాని ఒప్పుకోవడం లేదు. దాంతో ఎలాగైనా ఇండియా వెళ్లాలని సీఎం కేసీఆర్​ను వేడుకుంటూ సోషల్​మీడియాలో వీడియో పోస్ట్​చేశాడు. నెల రోజులు గడుస్తున్నా తనను ఇండియా తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు ప్రారంభించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. జూన్​2న తాను పని చేసేచోట పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

నా భర్తను కాపాడండి

దుబాయ్ లో చిక్కుకున్న తన భర్తను స్వదేశానికి రప్పించాలంటూ బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన వలస కార్మికుడి భార్య సయిండ్ల లక్ష్మీ శనివారం జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్నేళ్లుగా తన భర్త సయిండ్ల నర్సయ్య గల్ఫ్​లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని తెలిపింది. మూడు నెలలుగా పని లేక పస్తులుంటున్నాడని, దానికి తోడు ఇటీవల అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని పేర్కొంది. ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి రప్పించాలని కోరింది.

దేశంలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు

Latest Updates