ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటూ రెడ్ హిల్స్ లో ‘జై మహా భారత్’ హడావుడి

ఇళ్ల స్థలాలు ఇస్తున్నారంటూ రెడ్ హిల్స్ లో ‘జై మహా భారత్’ హడావుడి

హైదరాబాద్ : 18 ఏళ్లు నిండిన మహిళలు తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటే 200 గజాల ఇళ్ల స్థలం ఇస్తామంటూ ‘జై మహా భారత్’ పార్టీ హడావుడి చేస్తోంది. గత 3, 4 నెలల నుంచి ఆ పార్టీ ప్రతినిధులు గ్రేటర్ హైదరాబాద్ లో  మెంబర్ షిప్ డ్రైవ్ చేపట్టారు. ఈ విషయం తెలిసి నగరంలోని చాలా మంది నిరుపేద మహిళలు పెద్ద సంఖ్యలో ‘జై మహా భారత్’ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు. రవీంద్రభారతి సమీపంలోని రెడ్ హిల్స్ లో పార్టీ సభ్యత్వం కార్యక్రమం చేపట్టారు. దీంతో భారీ సంఖ్యలో మహిళలు, వృద్ధులు క్యూ లైన్ లో నిల్చుని మరీ ‘జై మహా భారత్’ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి రెండు ఫోటోలు, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని ‘జై మహా భారత్’ ప్రతినిధులు పార్టీ సభ్యత్వం ఇస్తున్నారు. 

కొందరు మహిళలు తమ చిన్న పిల్లలతో వచ్చి క్యూలైన్ లో గంటల తరబడి ఉండి సభ్యత్వం తీసుకుంటున్నారు. ‘జై మహా భారత్’ పార్టీ వాళ్లు ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తామని చెబితేనే తామంతా ఇక్కడకు వచ్చామని కొందరు మహిళలు  చెబుతున్నారు. ఇక మరికొందరు మహిళలు మరో వెర్షన్ వినిపించారు. ఏ పార్టీ వాళ్లు సభ్యత్వం ఇస్తున్నారో కూడా తెలియకుండానే ఇక్కడకు వచ్చామని చెప్పారు. అయితే.. ‘జై మహా భారత్’ పార్టీ ప్రతినిధులు మాత్రం మరో కారణం చెప్పారు. ఎవరైతే తమ పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారికి తప్పనిసరిగా వైకుంఠ ట్రస్ట్ ద్వారా 200 గజాల ఇళ్ల స్థలం ఇస్తామని చెబుతున్నారు. ఇందులో ఎలాంటి మోసాలు, దగా లేదని ‘జై మహా భారత్’ కూకట్ పల్లి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు చెప్పారు.

ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ భూములు కొని ఒక్కో మహిళ పేరిట వైకుంఠ ట్రస్ట్ ద్వారా 200 గజాల ఇళ్ల స్థలం ఇస్తామన్నారు. ‘జై మహా భారత్’ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ఇళ్ల స్థలాలు పక్కా వస్తాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. మరోవైపు గత మూడు, నాలుగు నెలలుగా పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ చేపట్టామని, ఇప్పటి వరకూ 5 లక్షలకు పైగా సభ్యత్వం పూర్తైందని ‘జై మహా భారత్’ పార్టీ కార్యకర్తలు చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది. 

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
పెద్ద సంఖ్యలో జనం రెడ్ హిల్స్ ప్రాంతానికి తరలిరావడంతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికంగా ఉండే కొంతమంది సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.