వైఎస్ భారతి పీఏ అని చెప్పి ఘరానా మోసం

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి పీఏనని చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. బ్యాంకు ఉద్యోగం మానేసి ఖాళీగా ఉన్న ఓ నిరుద్యోగి నుంచి లక్షకు పైగా వసూలు చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది.

విజయవాడ సమీపంలోని గొల్లపూడికి చెందిన కుమరేశ్వర అఖిల్  ఐసీఐసీఐ బ్యాంకులో కొన్నాళ్లు డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసి మానేశాడు. గత ఏడాది అక్టోబరులో తిరుమలలో గదులు కోసం జగదీష్‌ సత్యశ్రీరాం అనే వ్యక్తిని గదుల కోసం ఫోన్‌లో సంప్రదించాడు. ఆ సందర్భంలో సత్యశ్రీరాం తాను వై.ఎస్‌.భారతి పీఏ నని, పంచాయతీరాజ్‌ శాఖలో ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే తనను సంప్రదించాలని కోరాడు. ఆ మాటలు నమ్మిన అఖిల్.. తాను ప్రస్తుతం ఖాళీగా ఉన్నానని, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరాడు.

అఖిల్ తన మాయలో పడ్డాడని కన్ఫామ్ చేసుకున్న సత్యశ్రీరాం..  అతన్ని నమ్మించేలా ధ్రువీకరణపత్రాలతో పాటు రూ.60 వేలు ఇవ్వాలని చెప్పాడు. ఆ తర్వాత ఉన్నతాధికారులకు ఇవ్వాలంటూ మరికొంత డబ్బు వసూలు చేశాడు. అలా మొత్తం రూ.1,12,500 గుంజాడు. ఎన్ని రోజులైనా ఉద్యోగం రాకపోవడతో ఆరా తీసిన అఖిల్ కు సత్యశ్రీరాం వై.ఎస్‌.భారతి పీఏ కాదని తెలిసింది. తనతోపాటు మరో ఇద్దరిని కూడా ఇలాగే ఉద్యోగాల పేరిట మోసం చేసినట్లు తెలుసుకుని భవానీపురం పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates