బైక్ ఇంజిన్‌తో బోటు.. మెకానిక్ వినూత్న ప్ర‌యోగం

పెద్ద ఇంజనీరింగ్ చదువు లేమి చదవలేదు, ఎలాంటి సాంకేతిక కోర్సులను కూడా అభ్యసించ లేదు కానీ తన మేధాశక్తితో చేపలు పట్టే బోటును తయారు చేశాడు మెకానిక్ శంకర్. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రం బస్టాండ్ వద్ద ఓ టైర్ పంచర్ కొట్టు నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న శంకర్ తన ఆలోచనతో మత్స్యకారులు సులువుగా చేపలు పట్టుకోడానికి అనుకూలంగా ఉండే బోటును తయారు చేశాడు.

కోహెడ మండలం లోని శనిగరం ప్రాజెక్టు లో మత్స్యకారులు చేపలు పట్టడానికి తేప్పల తో వెళ్లి పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసిన శంకర్ వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని ఆలోచించాడు. ఆ ఆలోచనతో తన వద్ద ఉన్న పాత సుజుకి బైక్ ఇంజన్, టీవీఎస్ బైక్ హ్యాండిల్, థర్మకోల్ షీట్ లతో స్వంతంగా తయారుచేసిన రెక్కలతో గత ఎనిమిది నెలల క్రితమే బోటును తయారు చేశాడు. దానిని స్థానికంగా ఉన్న బాడుగుల చెరువులో ప్రయోగించగా కొన్ని లోపాలతో సఫలం కాలేదు. అయినా ప్రయత్నం సడలని శంకర్ ఎనిమిది నెలలుగా శ్రమించి చేపలు పట్టేందుకు బోటును సిద్ధం చేశాడు. ప్రస్తుతం స్థానిక బాడుగుల చెరువులో ప్రయోగాత్మకంగా బోటును నడపగా సఫలం అయింది. చెరువు వద్దనే బోటును ఉంచడంతో శంకర్ తయారుచేసిన బోటును చాలా మంది స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

మెకానిక్ శంకర్ మాట్లాడుతూ తాను శనిగరం ప్రాజెక్టు లో మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసి వారు చేపలు పట్టడానికి సునాయాసంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బోటును తయారు చేశానని తెలిపారు. పాత బైక్ సామాన్లతో దాదాపు 20 నుండి 25 వేల రూపాయల ఖర్చుతో బోటును తయారు చేశానని, మామూలు బైక్ లాగానే నీళ్లపై ముగ్గురు వ్యక్తుల వరకు వెళ్లవచ్చని అవసరమున్న చోట ఆపుకొని చేపలు పట్టుకుని సునాయసంగా దరికి చేరవచ్చన్నారు.

ప్రభుత్వం కానీ దాతలు కాని సహకరిస్తే మత్స్యకారులకు ఇలాంటి బోటు లను తయారు చేసి ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎవరైనా దాతలు కానీ జిల్లా మత్స్యశాఖ అధికారులు కానీ శంకర్ తయారుచేసిన బోటును వచ్చి పరిశీలించి ఇంకా ఏవైనా సూచనలు ఇచ్చి ప్రోత్సహిస్తే, శంకర్ బోటును ఇంకా మెరుగుగా తయారుచేసి మత్స్యకారులకు ఉపయోగకరంగా అందిస్తాడని శంకర్ స్నేహితులు చెబుతున్నారు. ఎంతైనా సాంకేతికంగా అన్ని హంగులతో ఉన్న ఒక బోటు ను కొనడానికి లక్షల రూపాయల వ్యయం అవుతుంది, కానీ శంకర్ తనను ప్రోత్సహిస్తే తక్కువ ఖర్చుతోనే మత్స్యకారులు సులభంగా చేపలు పట్టు కోవడానికి బోటును తయారు చేస్తాననడం ఓ మంచి విషయం.

A mechanic from the Koheda region who built a fishing boat with a bike engine

 

Latest Updates