ఈ యాప్ ఉంటే.. ఏమైనా వండొచ్చు

‘అరేయ్​.. రూమ్​లో టొమాటోలు, రెండు ఉల్లిగడ్డలు మాత్రమే ఉన్నాయ్​. జేబులో పైసల్​ కూడా లేవ్​? రైస్​ అయితే.. కుక్కర్​లో పెట్టేశిన. కూర ఏం చేయాల్నో అర్థం అయితలేదు. పచ్చడి కూడా రాత్రే అయిపోయింది’. ఫ్రెండ్స్​తో కలిసి రూమ్​లో ఉంటున్న ఓ బ్యాచిలర్​కి వచ్చిన వంట కష్టం ఇది. ‘ఉన్నవా..? చికెన్​ తెచ్చిన. ఏదన్న స్పెషల్​ చెయ్​’ ‘ఎంత తెచ్చినవ్​?’ ‘ఉన్నది ముగ్గురమే కదా.. అద్దకిలో తెచ్చిన.. సరిపోదా?’ ‘అద్దకిలో చికెన్​తో ఏం చేయమంటవ్​? ఫ్రై చేయనా? కర్రీ చేయనా? ‘యే.. ఊకో.. ఎప్పుడు ఫ్రై, కర్రీయేనా? ఏదన్న స్పెషల్​ చెయ్​’ ‘అద్దకిల కూరల ఏం చెయ్యాలె చెప్పు’ రెగ్యులర్​ ఫుడ్​ తిని బోర్​ కొట్టిన ఓ జంట మధ్య అరకిలో చికెన్​లో ఏం స్పెషల్​ చేసుకోవాలన్న చర్చ ఇది. అటు బ్యాచి​లర్స్​కి, ఇటు ఫ్యామిలీస్​కి వంట కష్టాలు దూరం చేస్తూ.. ఉన్న వాటితో ఏం వండుకోవాలి? ఎలా వండుకోవాలో చెప్పే స్టార్టప్​ వచ్చేసింది. దాని గురించే ఈ స్పెషల్​ స్టోరీ!

ఏం వండుకోవాలి? ఎలా వండుకోవాలి? వండుకోవడానికి ఇంట్లో ఏమున్నాయి? వంట మొదలుపెట్టేటప్పడు అందరికీ ఎదురయ్యే సమస్యే ఇది. కొన్నిసార్లు ఏదైనా వండాలనుకున్నప్పుడు కొన్ని వంట సరుకులు ఉండవు. అప్పుడు ఏం చేయాలి?  ఆ దినుసులు కొని తెచ్చి వంట మొదలుపెట్టాలి. లేదంటే.. వేరే వంటకు షిఫ్ట్​ అవ్వాలి. ఇక బ్యాచిలర్స్​ వంట కష్టాలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజూ వాళ్లు వంటతో ఓ యుద్ధమే చేస్తారు. ఇదంతా ఒక ఎత్తయితే.. అసలు రోజులో ఎన్ని కార్బోహైడ్రేట్లు మన శరీరానికి అందుతున్నాయి. మనం రోజూ తినే ఫుడ్​లో ఎన్ని కాలరీలు ఉంటున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘వాట్​ టు కుక్’​ స్టార్టప్​. స్మార్ట్​గా ఆపరేట్​ అయ్యే యాప్​ ద్వారా ఈ ప్రశ్నలన్నిటికీ చిటికెలో సమాధానం దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్​కి మంచి క్రేజ్​ వస్తోంది. ఇంతకీ ఈ స్టార్టప్​ పెట్టింది, యాప్​ తయారుచేసింది ఎవరో తెలుసా! మన కుర్రాళ్లే.. సాయి సంతోష్​, కార్తికేయన్​.

ఎవరు ఎంత చేసినా? ఎంత సంపాదించినా.. ఆకలవగానే.. కడుపులో ఇంత పడాల్సిందే. ఆ తినేదేదో.. రుచిగా ఉండాలి.. శరీరానికి అవసరమయ్యే పోషకాలు అందించాలి. అయితే.. వండిన వంటలే రిపీట్ చేస్తుంటే తినాలంటే కూడా విసుగు పుడుతుంది . వెరైటీ వంటలు చేయాలంటే.. యూట్యూబ్ సాయం తీసుకోవాల్సిందే. కానీ.. అందులో ఏవేవో ఇంగ్రెడియంట్స్​ వేయమని చెప్తుంటారు. అయితే.. వాట్ టు కుక్ యాప్ వీటన్నిటికంటే డిఫరెంట్ .

ఏం వండుకోవాలో చెప్తరు!

ఇదే స్పెషాలిటీ..

ఏదైనా వండాలంటే అందులోకి కావల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని కుకింగ్​ మొదలుపెడతాం. కానీ.. ‘వాట్​ టు కుక్’​ యాప్​ మీ మొబైల్​లో ఉంటే.. ఆ పద్ధతికి టాటా చెప్పొచ్చు. ఎందుకంటే.. మన దగ్గర ఏమున్నాయో ఆ యాప్​లో ఎంటర్​​ చేస్తే చాలు.. వాటితోనే ఏం వండుకోవచ్చో క్షణాల్లో రిజల్ట్​ చూపిస్తుంది. ఉదాహరణకు మీ ఇంట్లో నాలుగు టొమాటోలు, ఒక ఉల్లిగడ్డ, మూడు పచ్చిమిర్చి ఉన్నాయనుకోండి. అప్పుడేం చేస్తారు? ఉల్లిగడ్డ, టమాట కర్రీ వండేస్తారు. అంతకు మించి వేరే వంట చేయడానికి సాహసం చేయం. కానీ.. వాట్​ టు కుక్​ అలా కాదు. మీ దగ్గర ఏమేం ఉన్నాయో చెప్తే.. వాటితో ఎన్ని రకాల వెరైటీలు చేసుకోవచ్చో చెప్పేస్తుంది. అంతేకాదు.. మీరు వండిన ఆ వంటలో ఎన్ని కేలరీలున్నాయి?  ఎన్ని కార్బోహైడ్రేట్లున్నాయి? అనే వివరాలు కూడా చెప్తుంది. ఆ వంటకం చేయడానికి మీరు ఫోన్​ని చూస్తూ ఉండాల్సిన పని లేదు. వంటకం పక్కనే  ఉన్న ‘ప్లే’ ఆప్షన్​ నొక్కితే చాలు. వంట ఎలా చేయాలో ప్రాసెస్ అంతా ఆడియో ఫార్మాట్​లో ప్లే అవుతుంది. ఆ వంటకాలన్నీ పేరున్న సెలబ్రిటీ షెఫ్​లు వండినవే కావడం ఇక్కడ మరో విశేషం. – ప్రవీణ్‌కుమార్‌ సుంకరి

కుర్రాళ్ల గురించి..

ఈ స్టార్టప్​ని సాయి సంతోష్​, కార్తికేయన్​ అనే ఇద్దరు ఫ్రెండ్స్​ మొదలుపెట్టారు. అందులో సాయి సంతోష్​  తెలుగువాడే. కార్తికేయన్​, సాయి సంతోష్​ ఇద్దరూ భువనేశ్వర్​లో ఐఐటీ కలిసి చదివారు. గ్రాడ్యుయేషన్​ అయిపోయిన తర్వాత కార్తికేయన్..​ పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయాడు. సాయి సంతోష్​ కాగ్నిజెంట్​లో  రీసెర్చ్​ డెవలప్​మెంట్​లో ఉద్యోగంలో చేరాడు. ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం కంటే.. తానే సొంతంగా ఏదైనా బిజినెస్‌ చేయాలనుకున్నాడు సాయి సంతోష్​. ఆ తపనలోంచి పుట్టిందే ‘వాట్​ టు డూ’ అనే ఆలోచన. ఆ పేరు మీదుగానే స్టార్టప్​ పెడదామనుకున్నాడు. తన ఆలోచనను కార్తికేయన్​కి చెప్పాడు. ఆ సమయంలో సాయి సంతోష్​ బరువు నూట ఇరవై కిలోలు. ఏం పని  చేసినా క్షణాల్లోనే అలసిపోయేవాడు. దీనికి కారణం ఒబెసిటీకే బరువు. ముందు బరువు తగ్గించుకోవాలనుకున్నాడు. అందుకు డైట్​ ప్లాన్​ చేసుకున్నాడు. వర్కవుట్లు చేశాడు. ఈ సమయంలో ఫుడ్​ తగ్గించడం వల్ల తన హెల్త్​ మీద ఎలాంటి ఎఫెక్ట్​ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ఫుడ్​లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు తగ్గకుండా డైట్​ ప్లాన్​చేసుకున్నాడు. ఏం తిన్నా.. దానిలో ఎన్ని కాలరీలు ఉన్నాయి. ఎంత శాతం కార్బోహైడ్రేట్లు ఉన్నాయి అని చూసుకునేవాడు. అప్పుడే వాట్​ టు కుక్​ అనే ఆలోచనకు పదును పెట్టాడు. అదే.. వాట్​ టు కుక్​కి శ్రీకారం చుట్టింది. తమ పనిని పరీక్షించుకోవడానికి ఇజ్రాయెల్​లో నిర్వహించిన ప్రెస్టీజియస్​ ‘మాస్​ చాలెంజ్​’ కాంపిటీషన్​లో తమ స్టార్టప్​ని ప్రజెంట్​ చేశారు. ఆ చాలెంజ్​లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు స్టార్టప్​ ఎక్స్​లెటర్లు సెలక్ట్​ అయితే.. అందులో ‘వాట్​ టు కుక్​’ కూడా ఒకటి.