బయటకు తీసిన గుండెను కాపాడే డివైజ్

‘లబ్ డబ్’ ఆగనియ్యదు

24 గంటలు గుండెను బతికించే డివైస్ రెడీ

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి 50 ఏళ్ల కిందటే జరిగింది. అప్పట్లో డోనర్ హార్ట్ ను పేషెంట్ వద్దకు తీసుకుపోయేటందుకు ఐస్‌ ముక్కల్లో పెట్టి ఆగమేఘాల మీద ట్రాన్స్ పోర్ట్ చేసేటోళ్లు. కానీ టెక్నాలజీ ఇంతగా పెరిగినా.. 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా దాదాపుగా అదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే.. గుండెమార్పిడి టెక్నాలజీ ప్రపంచమంతా విస్తరించినప్పటికీ, గుండెను శరీరం బయట ఎక్కువ టైం బతికించడం మాత్రం కష్టం అవుతోంది. గుండెను డోనర్ నుంచి కట్ చేశాక.. 4 గంటల్లోనే పేషంట్ బాడీలో అమర్చాలి. లేకుంటే గుండె కణాలు చచ్చిపోయి అది ఉబ్బిపోతుంది. దీని కారణంగా గుండెను ఎక్కువ దూరం తరలించేందుకు ఆస్కారం లేకుండా పోతోంది. అయితే, గుండెను నాలుగు గంటలు కాదు.. ఏకంగా 24 గంటల పాటు సజీవంగా ఉంచే సరికొత్త డివైస్ ను యూనివర్సిటీ ఆఫ్ ​టెక్సాస్ హెల్త్ సైంటిస్టులు తయారు చేశారు. ‘ఉలీసెస్’ (గ్రీకు దేవుడు) అని పేరు పెట్టిన ఈ డివైస్ అందుబాటులోకి వస్తే ఏటా వేలాది మంది ప్రాణాలను కాపాడొచ్చని చెప్తున్నారు.

5 పంది గుండెలపై ప్రయోగం సక్సెస్

రీసెర్చ్ లో భాగంగా ఐదు పందుల గుండెలను సైంటిస్టులు 24 గంటల పాటు సజీవంగా ఉంచగలిగారు. గుండెలకు ఉన్న రక్తనాళాల్లోకి సెలైన్ ను పంప్ చేస్తూ, ఆక్సిజన్ పల్సెస్ ను పంపుతూ వారు ఈ గుండెలు శరీరం బయటా24 గంటల తర్వాత కూడా ఆగకుండా కొట్టుకుంటూ ఉండేలా చేశారు. శరీరంలో ఉండే పరిస్థితుల వంటివే బయటా కల్పిస్తే గుండె 24 గంటలు కూడా సజీవంగా ఉంటుందని నిరూపించారు. ఆర్టరీల ద్వారా ప్రిజర్వేషన్ సొల్యూషన్ ను పంప్ చేశారు. అదే సమయంలో ఒక నిమిషానికి 60 ఆక్సిజన్ పల్సెస్ ను పంపారు. అలాగే గుండెపై ఒత్తిడి పడి పగలకుండా ఉండేందుకు ఒక ద్రావణాన్ని పోశారు. తదుపరి రీసెర్చ్ లో భాగంగా.. ఒక పంది నుంచి గుండెను తీసుకుని, మరో పందికి అమర్చనున్నారు. అలాగే ట్రాన్స్ ప్లాంట్ కు పనికిరాని మనుషుల గుండెలపైనా మూడు నెలల్లో ప్రయోగం చేయనున్నారు. మొత్తంగా ఏడాదిలోగా ఈ డివైస్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని సైంటిస్టులు వెల్లడించారు. సూట్ కేస్ లో పట్టేంత ఉండే ఈ డివైస్ అందుబాటులోకి వస్తే.. ప్రపంచంలోని ఏ మూల నుంచి ఏ మూలకైనా గుండెను తరలించి, గుండె మార్పిడి చేయొచ్చని, ఇది ఎంతో మంది గుండెజబ్బు రోగులకు వరంలా మారుతుందని చెప్తున్నారు.

Latest Updates