టీబీకి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ను కనిపెట్టిన శాస్త్రవేత్తలు

ఎన్ని మందులు వాడినా లొంగకుండా మొండిబారిపోతోంది టీబీ. యాంటీబయాటిక్​లు తరచూ వాడితే ఫర్వాలేదుగానీ, ఒక్కసారి ఆపేస్తే టీబీ ప్రభావం పెరిగిపోతుంటుంది. ఇలాంటి బాధలకు చెక్​పెట్టే కొత్త వ్యాక్సిన్​ను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ పిట్స్​బర్గ్​ సైంటిస్టులు కనుగొన్నారు. ఇప్పటికే టీబీ మహమ్మారికి (బీసీజీ– బేసిల్లి కాల్మెటి గ్వెరిన్​) వ్యాక్సిన్​ ఉన్నా, తాము తయారు చేసింది మాత్రం కొత్త తరహా వ్యాక్సిన్​ అని సైంటిస్టులు చెబుతున్నారు. మామూలుగా వ్యాక్సిన్​ను చర్మం ద్వారా ఇస్తారు. కానీ, ఇప్పుడు సైంటిస్టులు తయారు చేసింది ఐవీ వ్యాక్సిన్​. పాత బీసీజీ వ్యాక్సిన్​నే కొత్తగా రక్తనాళాల ద్వారా ఇచ్చేందుకు మోడిఫై చేశారు. దానివల్ల మందు రక్తంలోకి నేరుగా పోవడం వల్ల ఫలితం వేగంగా వస్తుందని చెబుతున్నారు. ఆ వ్యాక్సిన్​ను కోతులపై ప్రయోగించి సక్సెస్​ అయ్యారు. పదిలో తొమ్మిది కోతులకు టీబీ నయమైందని తేల్చారు. లక్ష రెట్లు ఎక్కువ ప్రభావం కనిపించిందని చెబుతున్నారు. టీబీ ఉన్న కోతులను ఆరు గ్రూపులుగా విభజించి వ్యాక్సిన్​ను పరీక్షించామని సైంటిస్టులు చెప్పారు. వ్యాక్సిన్​ వేయని కోతులు, మామూలు ఇంజెక్షన్​ వేసినవి, ఎక్కువ డోస్​ ఇంజెక్షన్​ ఇచ్చినవి, మిస్ట్​, మిస్ట్​ ప్లస్​ ఇంజెక్షన్​, ఐవీ ద్వారా బీసీజీ వ్యాక్సిన్​ ఇచ్చిన కోతులుగా విభజించి పరీక్షించారు. వీటన్నింటితో పోలిస్తే రక్తనాళాల ద్వారా బీసీజీ వ్యాక్సిన్​ ఇచ్చిన కోతుల్లో మెరుగైన ఫలితాలు కనిపించాయని గుర్తించారు.

Latest Updates