ప్రసవం కోసం వస్తే బిడ్డను చంపేసిన్రు

  • సర్కారు దవాఖాన ఎదుట బంధువుల ఆందోళన
  • వనస్థలిపురంలో దారుణం

ఎల్బీ నగర్, వెలుగు: పురిటి నొప్పులతో ఆస్పత్రికి వస్తే బిడ్డ ప్రాణం తీశారని హైదరాబాద్​లోని వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి ముందు మృతి చెందిన చిన్నారి బందువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే కడుపులో బిడ్డ చనిపోయిందని ధర్నాకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నల్లచెరువుకు చెందిన దంపతులు శంకర్, ప్రసన్న బతుకుదెరువు కోసం వచ్చి మీర్​పేట్ జిల్లెలగూడలో నివాసం ఉంటున్నారు. తొమ్మిది నెలల గర్భిణి అయిన ప్రసన్నకు సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. 10 గంటల సమయంలో డాక్టర్లు డెలివరీ చేశారు. కానీ బిడ్డను మాత్రం చూపించలేదు. కొద్దిసేపటికే బిడ్డకు సీరియస్ గా ఉందని, నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. అక్కడికి తీసుకెళ్లగా బిడ్డ అప్పటికే చనిపోయిందని డాక్లర్లు చెప్పారని బంధువులు తెలిపారు. పుట్టిన బిడ్డ తలకు గాయం ఉండటంతో అనుమానం వచ్చిన బంధువులు వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి వచ్చి సిబ్బందిని నిలదీశారు. ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బిడ్డ పుట్టిన సమయంలోనే కిందపడి గాయమై చనిపోయిందని అనుమానం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ముందు బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

Latest Updates