పొంగుతున్న మురుగు.. ఏరులైన రక్తం: ఈగలతో నిండిపోయిన కరాచీ

ఊ అంటే.. ఆ అంటే.. అణుబాంబులంటున్నరు పాకిస్థాన్​ రాజకీయ నాయకులు. ప్రపంచం ఏమనుకున్నా ఎంతకైనా తెగిస్తమని నిన్నటికినిన్న ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ బెదిరింపులకు దిగిన్రు. ఇంకో మంత్రి అయితే అక్టోబర్​లో యుద్ధం ఖాయమంటూ ప్రకటన చేసిన్రు. కానీ, తానే ఓ ఇంటి యుద్ధం చేస్తోంది పాక్​. దేశంపైకి దండెత్తి వచ్చిన శత్రువుపై పోరాడుతోంది. అయినా, ఆ పోరులో గెలవలేక ఆయాసపడి, నీరసించి చేతులెత్తేస్తోంది. అవును నిజం. పాకిస్థాన్​ చేస్తున్న ఆ ఇంటి యుద్ధం ఈగల మీద. పాక్​ బిజినెస్​కు గుండె కాయలాంటిది కరాచీ నగరం. ఆ సిటీపైనే ఈగలు భారీగా దండెత్తాయి. దీంతో జనాలు వాటి నుంచి ఎట్లా విముక్తి పొందాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నారు.

పొంగుతున్న మురుగు.. ఏరులైన రక్తం

పేరుకే బిజినెస్​ హబ్​ అయినా చాలా చెత్త నగరంగా కరాచీకి ఆ దేశంలో పేరుంది. ఎందుకంటే ఎప్పుడు చూడు సిటీలో మురుగు నీళ్లు పొంగి పొర్లుతుంటాయట. వర్షాలు వచ్చినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందట. దానికి తోడు ఈ మధ్య బక్రీద్​కు పశువులను పెద్ద సంఖ్యలో బలిచ్చారు. దీంతో రోడ్లపై రక్తం ఏరులైపారిందట. అంతేకాదు, పశు వధ టైంలో మిగిలిపోయిన వ్యర్థాలు ఎక్కడికక్కడ పోగుపడ్డాయి. ఆ నీసు వాసనకు, మురుగు నీళ్లకు ఈగలు కరాచీపై దండెత్తాయి. దీంతో ఆ దేశం ఇప్పుడు ఈగలపై పెద్ద యుద్ధమే చేస్తోంది. ఆ దేశ చానెళ్లలో కాశ్మీర్​తో పాటు ఈగలపై యుద్ధం కూడా హాట్​ టాపిక్​ అయింది. ఎన్ని రకాల మందులు కొట్టినా ఈగల సంఖ్య మాత్రం తగ్గట్లేదట. రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప అవి తగ్గుతున్న దాఖలాలు మాత్రం కనిపించట్లేదట. అంతేకాదు, తింటున్నా, తాగుతున్నా వాళ్ల చుట్టూ ఈగలు ముసురుకుంటున్నాయి. దీంతో వాటితో ఎలా వేగాలో అర్థంకాక జనాలు సతమతమవుతున్నారు. నిజానికి ఇంతకుముందు నుంచీ కరాచీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఈగల బెడద ఎక్కువగానే ఉన్నా, బక్రీద్​ తర్వాత మరింత ఎక్కువైందని అక్కడి జనాలు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా అక్కడి అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అక్కడోళ్లు ఆరోపిస్తున్నారు.

ఈగలతో దోమల దోస్తీ

ఈగలే అనుకుంటే.. వాటికి దోమలూ జత కలిశాయి. రెండూ కలిసి సిటీపై దాడి చేస్తున్నాయి. దీంతో కాంగో వైరస్​, డెంగ్యూ వంటి ప్రాణాంతక రోగాలు వ్యాపిస్తున్నాయి. చిన్న చిన్న పనులకూ అడ్డు తగులుతున్నాయి. ‘‘ఇంట్లో ఈగలను చంపేందుకు మందు కొట్టికొట్టీ విసుగొస్తోంది” అంటూ ఓ వ్యక్తి చెప్పడం చూస్తుంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బక్రీద్​కు ముందు ఈగలు, దోమలను తగ్గించేందుకు 40 వాహనాలతో మందులను జల్లితే, ఇప్పుడు కేవలం 5 బండ్లను మాత్రమే వాడుతున్నారు. దానికీ ఓ కారణముంది. అదే, ఇంధనం. అవునట. ఇంధన కొరత వల్ల ఎక్కువ బండ్లను వాడలేకపోతున్నారట. దీంతో జనాలూ ఏం చేయాలో పాలుపోక నిరసనలకు దిగుతున్నారట. మంగళవారం ఓ వ్యక్తి ఈగలు, దోమల బెడద తట్టుకోలేక కోర్టులో కేసు వేశాడని అక్కడి ఓ న్యూస్​ చానెల్​ పేర్కొంది. సింధ్​ ప్రభుత్వం, కరాచీ మేయర్​, అధికారులు సిటీని క్లీన్​ చేసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదని, వెంటనే చర్యలు తీసుకునేలా వారికి ఆదేశాలివ్వాలంటూ  ఆ పిటిషన్‌‌లో ఆ వ్యక్తి కోరాడు. మరి, ఇండియాతో అణుయుద్ధం మాట దేవుడెరుగు, ఈగలతో చేస్తున్న ఇంటి యుద్ధంలో పాక్​ ఇప్పుడైనా గెలుస్తుందో లేదో!!

మరిన్ని వెలుగు న్యూస్ కోసం క్లిక్ చేయండి

Latest Updates