యువతిపై రేప్​..ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి

  • అంత్యక్రియలకు పేరెంట్స్ ఏర్పాట్లు
  • అడ్డుకుని, పోస్ట్ మార్టానికి తరలించిన పోలీసులు

సూర్యాపేట, వెలుగుసూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది.  పిక్లా నాయక్ తండాకు చెందిన డిగ్రీ ఫైనలియర్ స్టూడెంట్​పై హైదరాబాద్ లో అత్యాచారం జరిగిన విషయం స్థానికంగా కలకలం సృష్టించింది. ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతూ యువతి ఆదివారం రాత్రి చనిపోయింది. తల్లితండ్రులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రి వర్గాల నుంచి సమాచారం రావడంతో కోదాడ పోలీసులు అలర్ట్ అయి.. అంత్యక్రియలను అడ్డుకున్నారు. డెడ్​బాడీని పోస్టుమార్టానికి తరలించాలని తల్లిదండ్రులకు చెప్పి హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. లేడీ డాక్టర్ లేకపోవడంతో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం పోస్ట్ మార్టం నిర్వహించారు. యువతి మృతిపై తల్లితండ్రులు, డాక్టర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పోస్టుమార్టం ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతి పీజీ కోచింగ్ కోసం కొన్నాళ్లుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఘట్కేసర్ లో కోచింగ్ తీసుకుంటోంది. పోయినవారం తండాకు వచ్చి తిరిగి గురువారం కాలేజీకి బయల్దేరింది. నార్కట్ పల్లి వరకు తండ్రి వదిలి పెట్టగా అక్కడ నుండి ఆమె స్నేహితురాలి బంధువు బైక్ మీద హాస్టల్ లో దింపాడు. ఏం జరిగిందో తెలియదు తెల్లారేసరికి యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందంటూ హాస్టల్ మేనేజ్​మెంట్ ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. శుక్రవారం ఆమెను  ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.  యువతి పరిస్థితి సీరియస్ గా ఉందని ఖమ్మం ఆస్పత్రి వర్గాలు తల్లిదండ్రులకు తెలిపాయి. ఆదివారం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమెచనిపోయింది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు అసలు విషయాన్ని దాచి పెట్టి ఆరోగ్యం బాగా లేదంటూ అంత్యక్రియలకు రెడీ అయ్యారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

Latest Updates