మంత్రాల నెపంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి సజీవ దహనం?

మల్యాల, వెలుగు:  జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్ గ్రామంలో పవన్ (35) అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బంధువులే అత్యంత దారుణంగా హతమార్చారు. మంత్రాల నెపంతో పెట్రోల్​ పోసి సజీవ దహనం చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లోని అల్వాల్ కు చెందిన పవన్ (35) బెంగుళూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.  బల్వంతపూర్​కు చెందిన కృష్ణవేణితో ఆయనకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా, 12రోజుల క్రితం అతని బావమరిది జగన్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ క్రమంలో అత్తింటివారిని పరామర్శించడానికి సోమవారం పవన్ బల్వంతా పూర్  వచ్చాడు. అంతకు వారం క్రితమే పవన్​ భార్య కృష్ణవేణి పుట్టింటికి వచ్చింది. కాగా, పవన్​ మంత్రాలు చేయడం వల్లే జగన్​ చనిపోయాడని జగన్​ భార్య సుమలత,  జగన్​ అన్న విజయ్​బాబా, ఇతర కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలోనే గొడవ జరగగా, సోమవారం రాత్రి ఇంట్లోని ఓ గదిలో పవన్​ను కొట్టి పెట్రోల్​పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. ఆ ఇల్లును ఆనుకొని ఉన్న మంజునాథ సహస్రలింగాలయంలో విజయ్​బాబా​ పూజారిగా ఉన్నాడు. ఇంట్లో గొడవ జరగడం, ఆతర్వాత మంటలు, వాసన రావడంతో చుట్టుపక్కలవాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకునేసరికి పవన్​డెడ్​బాడీ పూర్తిగా కాలిపోయింది. బంధువులే ఈ హత్యకు పాల్పడ్డారని భావించిన పోలీసులు,  జగన్​ భార్య సుమలత, జగన్​ అన్న విజయ్​ బాబా ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతుడి భార్య కృష్ణవేణి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. డెడ్​బాడీని పోస్టు మార్టానికి తరలించి, దర్యాప్తు చేస్తున్నామని జగిత్యాల డీఎస్పీ  వెంకట రమణ, మాల్యాల సిఐ కిషోర్, ఎస్ ఐ నాగరాజు వెల్లడించారు.

 

Latest Updates