చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతున్న పాట

ఒకనాటి ఇరానీ కేఫ్ లో వినిపించే ‘రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్ పాట మళ్లీ వినిపిస్తోంది. జిందాబాద్ కొట్టినా ఆగిపోడానికి రిక్షావాలాలు లేరిప్పుడు. ఆటోవాలాలంతా మా గురించే పాడుతున్నట్లుగా ఆగి వింటున్నారు. ‘కారులో షికారు కెళ్లే పాలబుగ్గల పసిడి దాన’ అని పాడుతూ ఆ తరాన్నే కాదు బస్తీ పోరగాళ్లను కూడా భలేగా ఖుషీ చేస్తున్నారు వీళ్లు. ఎవరికీ కళ్లు కనిపించవు. కళ్లులేవని నీవు కలతపడవలదని పాడుతూ శిల్పాలనే కాదు మరెన్నో అందాలను ఆలపిస్తున్నారు. రోజుకో చౌరస్తాలో పాటలు పాడుకోవడమే వీళ్లకు బతుకు. వడ్డించిన విస్తరిలాంటి జీవితాలను చూసి అమ్మానాన్నని నిందించే తరానికి వాళ్ల పాటలే కాదు వాళ్ల జీవితాలు కూడా స్ఫూర్తి పాఠాలే. ధనమేరా అన్నిటికి మూలం అని చెబుతూ ఆ ధనం కోసం ఎన్ని పాటలు పాడాడో చెబుతున్నాడు గుడివాడ ప్రసాద్. నరుని బ్రతుకు నటనే అయినా ఈశ్వరుని తలపు ఘటనగా ఎన్నో సంఘటనలు మనతో చెబుతున్నాడు. పల్లవికి, చరణానికి మధ్య ఊపిరి తీసే ప్రసాద్ ఆలపించే ‘సాకీ’ ఆలకిద్దామా?

ప్రసాద్ వాళ్ల నాన్న టేకి శ్రీనివాస్ కంసాలి పని చేసేవాడు. రాజమండ్రి నుంచి వచ్చి గుడివాడలో వర్కు షాప్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నడు.  ప్రసాద్ కి ఇద్దరు చెల్లెళ్లున్నారు. ప్రసాద్ కి పాటలంటే ఇష్టం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లే చిన్నప్పటి నుంచి పాటలు వినేవాడు. విన్నవి పాడేవాడు. ‘పిల్లలూ దేవుడూ చల్లని వారే’ అంటూ పాడుకునే కల్లకపటమెరుగని  ఆ అబ్బాయికి  ఓ రోజు అనుకోని కష్టమొచ్చింది. వాళ్ల నాన్న కొనిచ్చిన మూడు చక్రాల సైకిల్ ఇయ్యమని ఓ అబ్బాయి అడిగిండు. మా నాన్న ఏమంటాడోనని ప్రసాద్ ఇయ్యనన్నడు. అంతే.. కంకర రాళ్లు అందుకుని ముఖాన విసిరి పారిపోయిండు. రెండు కళ్లకూ దెబ్బలు తగిలాయి. విశాఖపట్నం తీసుకుపోయి చూపించారు.  ఆపరేషన్ చేసి ఒక కంటి చూపుని కాపాడారు. ప్రసాద్ మళ్లీ బడిబాటపట్టిండు. ఓ రోజు ఆడుకునే పిల్లల్ని చూస్తూ ఉన్నడు. వాళ్లు ఆడుకుంటున్నప్పుడు ఒకరినొకరు తోసుకుంటూ  వచ్చి ప్రసాద్ మీద పడ్డారు. డాక్టర్లు కాపాడిన కంటికి మళ్లీ దెబ్బతగిలింది. డాక్టర్లు చేతులెత్తేశారు. పదకొండేళ్లకే  కంటి చూపు పోయింది.

ఎన్ని కొండలెక్కినా…కరుణించలే

అమ్మానాన్నలు మొక్కని దేవుడు లేడు. ‘తల్లివి నీవే,. తండ్రివి నీవే.. చల్లగ కరుణించే దైవము నీవే’  అంటే సింహాచలం లక్ష్మీ నరసింహునికి మొక్కుకున్నారు. విజయవాడ కనక దుర్గకు మొక్కుకున్నారు. ‘వేడుకున్న దయదలిచే వెంకట రమణ’ అంటూ తిరుపతి కొండలూ ఎక్కారు. వాళ్లు ఎక్కని కొండలేదు. మొక్కని దేవుడు లేడు.  ఏ దేవుడూ కరుణించలేదు. బిడ్డకు చూపు రాలేదు.

శ్రీనివాస్ చిన్నప్పుడు వీధి భాగవతాలు ఆడేవాడు. వాళ్ల అన్న హరిదాసు. కళాభిమానంతో గురువుని పెట్టి వయోలిన్ నేర్పించిండు. ‘భలే మంచి రోజు పసందైన రోజు’ అంటూ ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తే మూడేళ్లకు వయొలిన్లో పర్ఫెక్ట్ అయిండు. ప్రసాద్ కి సంగీతం మీద ఆసక్తి పెరిగింది. గ్రామ్ ఫోన్ రికార్డుల్లో ఘంటసాల పాటలు వింటూ ప్రాక్టీస్ చేసిండు. ప్రసాద్ పెద్దయ్యాక తన కాళ్ల మీద తాను  నిలబడాలని ఆగిపోయిన చదువుని పట్టాలెక్కించారు.  హైదరాబాద్ (మలక్ పేట)లో ప్రభుత్వ అంధుల పాఠశాలలో 1974లో  చేర్పించారు. అక్కడ కూడా అయిదో తరగతి వరకు బ్రెయిలీ లిపిలో చదివిండు. పదకొండేళ్ల వయసొచ్చింది. తను ఉండే హాస్టల్లో ఎంఏలు, బీఏలు, ఎల్ఎల్ బీ చదివిన వాళ్లు ఉద్యోగాలు రాక ఏదో ఒక కోర్సు చదువుతూ అక్కడే ఉంటున్నారు.

అమ్మానాన్నతో పంచుకోలేని సంతోషం

నలుగురిలో పాడి చప్పట్లు కొట్టించుకుంటే అమ్మానాన్న గర్వపడతారు. కానీ నలుగురినీ పాటలతో మెప్పించి పైసలడిగితే ఎందుకో చిన్నబుచ్చుకుంటారు. లోకంలో ఉన్న రీతే ప్రసాద్ వాళ్ల ఇంట్లో కూడా ఉంది. చెబితే వద్దంటారని తెలిసి చెప్పకుండానే ఓ రోజున గుడివాడ సెంటర్లో కచేరీ మొదలుపెట్టిండు. అద్దె మైకు అందుకుని ‘వాతాపి గణపతింభజే’ అంటూ పాడడం మొదలుపెట్టిండు. ‘ఘంటసాలను పోలిన గాత్రంతో కొత్త కుర్రోడు భలే పాడుతున్నాడే’ అంటూ గుడివాడ జనం గుంపయ్యారు. ‘జగదేక వీరుని కథ’లోని ‘శివశంకరి’ పాట పాడుతుంటే.. ఆ ‘శివానందలహరి’కి జనం ఆశ్చర్యపోయారు. వయోలిన్ తప్ప మరో ఇన్స్ర్టుమెంట్ లేదు. పొద్దున ఏడు గంటలకు మొదలుపెట్టి మధ్యాహ్నం 12 గంటల వరకు వంద పాటలు పాడి జనాన్ని మైమరపించిండు.  డ్యూయెట్స్ పాడాలంటే లేడీ సింగర్ లేదు. అయినా సరే.. ‘ఖుషీ ఖుషీగా పాడుతూ, చలాకి మాటలు రువ్వుతూ’  ఆడియన్స్‌ని మెప్పించిండు.  తొలి రోజు కలెక్షన్ అదిరిపోయింది. ఆ రోజుల్లో (1974లో) రోజుకు వెయ్యి రూపాయల సంపాదన అంటే సినిమా కళాకారుల కంటేఎక్కువే అని చెప్పాలి! ఆ సంతోషాన్ని అమ్మానాన్నలతో పంచుకోలేదు. కొడుకు రోడ్ల మీద పాటలు పాడుతున్నాడంటే బాధపడతారని చెప్పలేదట. కానీ, ఆ పాటల ప్రయాణం మాత్రం ఆపలేదు. ఓ రోజు చెల్లెళ్ల చదువు కోసం అమ్మానాన్నకు డబ్బులిచ్చిండు. ‘ఎక్కడిది ఈ డబ్బు’ అని ఇంట్లో అడిగితే.. ‘పాడితే వచ్చిన డబ్బ’ని చెప్పిండు. ఆరోజు  అమ్మానాన్న కాసేపు బాధపడ్డారట.

తరలిరాద తనే వసంతం

‘తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు’ అని అన్నమయ్య పాడుకున్నట్లే ప్రసాద్ పాటలనే నమ్ముకుని జీవితంలో ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన గానకళకు మెచ్చిన ఎందరో సంగీతాభిమానులు ‘రండి రండి రండి దయచేయండి.. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి’ అంటూ విజయనగరం, విశాఖపట్నం స్వాగతం పలికారు. ‘జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా.. జంకు బొకు లేక ముందు సాగిపొమ్మురా’ అంటూ ఎక్కడికి పిలిస్తే అక్కడికి పోయిండు ప్రసాద్. ‘ఎంతో చిన్నది జీవితం.. ఇంకా చిన్నది యవ్వనం’ అంటూ కాలాన్ని వృథా చేసుకోకుండా  అవకాశాల్ని వదులుకోకుండా సాగిపోతున్నాడు. 1986లో  ఆ పాటల స్ఫూర్తిని చూసిన విశాఖపట్నంలోని  ఓ కళాభిమాని ఇంటికి పిలిచి అన్నం పెట్టిండు.  తన కీ బోర్డుని ప్రసాద్ చేతిలో పెట్టి నీ చేతిలో ఇది రాగాలు పలకడమే న్యాయమని కానుకగా ఇచ్చిండు. నిజామాబాద్ నుంచి ఓ అభిమాని కీ బోర్డ్, తబలా ప్రసాద్‌కి పంపించిండు.ఇ లా ఎందరో అభిమానులు ఆదరించి చీకటి జీవితాన్ని పాటలతో వెలిగించారు. బతుకు చీకటైనా పాటల వెలుగులో ప్రసాద్ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. ఆయనతో స్వరం కలపాలని అప్పటి ఆర్కెస్ర్టాలు ఆఫర్ చేశాయి. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అంటూ ఆర్కెస్ర్టాలోకి దూకిండు. నలుగురితో కలిసి పాడటం చాలా కష్టం. స్టేజీ ప్రదర్శనకు ముందే రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసి పాడి పొరపాటు దొర్లకుండా మెప్పించిండు.  ఆర్కెస్ర్టాలో అతని ప్రతిభ చూసి ఓ నాటక కంపెనీ పిలిచింది. 20 ఏళ్ల పాటు వాళ్లతో కలిసి పనిచేసిండు.ఇ ట్ల ప్రసాద్ పాటలు మూడు పువ్వులుగా సంగీతం ఆరు కాయలుగా వర్థిల్లుతోంది.

నాకు నీవు.. నీకు నేను

ఘంటసాలే పాడుతున్నాడా? అన్నట్లున్న ప్రసాద్ గాత్రం విని కంచేటి శేషగిరి రావు ముచ్చటపడి, తనని ఒప్పించి హైదరాబాద్ తీసుకొచ్చిండు. హైదరాబాద్ లో ఉండే మరో అంధురాలు రమతో కలిపి ‘ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే’ అంటే డ్యూయెట్ పాడించి, రికార్డ్ చేయించిండు. వాళ్లిద్దరి జోడీ ఎన్నో పాటలు పాడింది. ‘ఆకాశ వీధిలో అందాల జాబిలి’ అంటూ పాడుకుంటున్న ఆ సింగర్స్‌లో రమకు అందాల జాబిలిని చేరుకునే అవకాశం వచ్చింది. ఎల్ఐసీలో ఉద్యోగం రావడంతో ఆమె తప్పుకుంది.

కనులు లేవని కలతలొద్దు

కర్నూలులో ప్రసాద్ పాటలు పాడుతుంటే ‘ఎలా పాడుతున్నాడో విను’ అని రాధని వాళ్ల పక్కింటాయన పాడే దగ్గరకు తీసుకొచ్చిండట. ‘మీతోపాటు నేనూ పాడతాను. బతకడానికి నాకు ఏ ఆధారమూ లేదు’ అంటే ‘కనులు లేవని నీవు కలతపడ వలదు’ అని ఆమెకు ధైర్యం చెప్పి, పాడటం నేర్పిండు. పాడించిండు. పాడినన్ని రోజులు జీతం ఇచ్చిండు. ఏడాది తర్వాత రాధ కొంతమంది పాటగాళ్లతో కలిసి సొంత ట్రూప్ పెట్టుకుని ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు’ అంటూ రాయలసీమలో సొంత ఆర్కెస్ర్టాతో బతుకుతోంది.

పదేళ్ల క్రితం నరసరావుపేటలో పాడుతుంటే లత అనే  అంధురాలు పాడేందుకు ముందుకొచ్చింది. ఆమె బడిలో సంగీతం కూడా నేర్చుకుందట.  బతకడానికి ఆధారం ఏమీ లేదు. ఈ పాట దారి చూపిస్తే పాడుకుంటూ బతుకుతానని ఆర్కెస్ర్టాలో చేరిపోయింది. ఆమె భర్తకు సంగీతం రాదు. ఆయనకు ప్రసాద్ నేర్పించాడు. వాళ్ల పాటల ప్రయాణం సాగిపోతున్నప్పుడు లత, ఆమె భర్తకు ఎల్ఐసీలో జాబ్ వచ్చింది. నాలుగేళ్ల తర్వాత ప్రసాద్ ఒక్కడే అయ్యాడు. అయినా పాట ఆగిపోలేదు. తెనాలిలో తనకు మరో బ్లైండ్ సింగర్ పరిచయం అయింది. ఆమె తనతో కలిసి పదేహేనేళ్లు పాడింది. భజన పాటలు పాడే ఆమెకు సినిమా పాటల్ని ట్రాక్ మీద పాడటం నేర్పించిండు.  రెండు సంవత్సరాలు ప్రసాద్‌తో కలిసి పాడి విశాఖపట్నంలో ఉంటూ ఉత్తరాంధ్రలో పాడుతూ ఉంది. ఆర్కెస్ర్టా కోసం సొంత వ్యాన్ కొని జర్నీ చేస్తోందామె.

జీరో బ్యాలెన్స్

రాగం, తాళం సరిపోయిన పాట ఎంత వీనులు విందుగా ఉంటుందో గానం. ఈ ప్రయాణంలో ఆకలితో ఎండింది లేదు. మేడలు కట్టింది లేదని ప్రసాద్ అంటున్నాడు. ప్రతి కళాకారుడికీ రోజుకు వెయ్యి రూపాయలు కూలీ, టీ, టిఫిన్, మీల్స్ నేనే పెట్టాలి. పాటలకు మెచ్చే, కష్టానికి కరిగిపోయే దాతలు ఇచ్చే పదీ, వంద రూపాయలతోనే బతకాలి. ఓ రోజు నష్టం వస్తే, లాభం వచ్చిన రోజు ఆ నష్టం పూడుద్దని చెబుతున్నాడు. ఇట్లనే ఓ ఊళ్లో పాడటానికి పోతే ఒకాయన ఇంటికి పిలిపించుకుని పాడించిండట. అక్కడ పాడుతుంటే వినడానికి ఇంకెవరో వచ్చారట. పాటల కచేరీ అయిపోయాక.. ‘మీ కులం వాడే.. కళ్లు కనిపించకున్నా ఒకరిపై ఆధారపడకుండా తనకాళ్లపైతాను నిలబడ్డాడు. ‘సంబంధం ఉంటే చూడని’ చెప్పిండట. ప్రసాద్‌ని చూడ్డానికి వచ్చిన మనిషే ఓ పెండ్లి సంబంధం చూసిండు. 1985లో సాయికుమారితో ఆయనకు పెండ్లి అయింది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. కార్పెంటర్లుగా బతుకుతున్నారు. సంపాదించిన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్లేకున్నా పది మంది జీవితాలకు వెలుగునిచ్చానని ప్రసాద్ గర్వంగా చెప్పుకుంటున్నడు.

పాటల పల్లకిలో ‘ప్రేమగీతం’

ఇప్పుడు ప్రసాద్ పాటకు కోరస్ భాగ్యమ్మ, కిశోర్. వీళ్లు మూడేళ్ల క్రితం ప్రసాద్‌కి పరిచయం అయ్యారు. బ్రెయిలీ ఇన్స్టిట్యూట్స్లో కిషోర్ బీకాం. కంప్యూటర్స్ చదివిండు. స్కూల్ డేస్ నుంచి ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాడు. తొమ్మిదేళ్లప్పుడు డ్రమ్స్ వాయించడం నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆర్కెస్ట్రాలో ఓ మోత మోగే  రిథమ్ పాడ్ నేర్చుకున్నాడు. కిశోర్ బెంగళూరులో కంప్యూటర్స్ నేర్చుకునేందుకు పోతే అక్కడ భాగ్యమ్మ పరిచయం అయింది. ఆమె మంచి గాయని. ఎంఏ, బీఈడీ చదివింది. ఆ తొమ్మిది నెలల ట్రైనింగ్‌లో రెండు కళాహృదయాల మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి కాగానే బతుకుదెరువు వెదుక్కుంటున్నారు. అదే  టైంలో కిశోర్ ఫ్రెండ్ ప్రసాద్ గురించి చెబితే ‘చీకటి వెలుగుల సంగీత విభావరి’లో చేరిండు. భాగ్యమ్మ ‘ మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది’ అంటూ ఎంత బాగా పాడుతుందో, ఈ కాలం అరుపులు కేకలు ఉన్న పాటలు కూడా ట్రాక్ తప్పకుండా పాడేస్తుంది. రిథమ్ పాడ్ అదిరిపోయే పాటలకు కుదిరినట్లు పాతపాటలకు కుదరదని కిశోర్  డోలక్ కూడా నేర్చుకున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఒకరు ఏడాదిన్నర. మరొకరు నెలల పసికందు. ఒకే ఒక్క పాట ఈ నలుగురి ఆకలి తీరుస్తోంది.

పొదరిల్లు లేని పాట

లాక్ డౌన్ వచ్చాక అప్పులపాలయ్యాను. హైదరాబాద్ యూసుఫ్ గూడలో ఉంటూ పాడుతున్నాను. మధ్యలో కరోనా వచ్చి మా పొట్టకొట్టింది. లాక్ డౌన్లో ఆదాయం లేదు. అద్దె కట్టలేదు. తిండికే కటకటగా ఉంది. ఒకప్పుడు నాతోపాడిన గాయని రమ బియ్యం, కూరగాయలు ఇచ్చింది. ఆమెకు ఉద్యోగం ఉందికాబట్టి మేం బతికిపోయాం. అప్పుడు ఎవరి బతుకు వాళ్లే చూసుకుంటున్నారు. మావైపు ఎవరూ చూడలేదు. పది రోజుల నుంచి సిటీలో రోజుకో రెండు చోట్ల పాడుతున్నాం. ముందు తిండి తిప్పలు తీరితే అద్దె బాకీ కట్టాలని చూస్తున్నా. నాకు 62 సంవత్సరాలు. ఇంకెంతకాలం పాడతానో.  గవర్నమెంటు ఎక్కడైనా చిన్న ఇల్లు ఇస్తే అదే చాలని కోరుకుంటున్న.-గుడివాడ ప్రసాద్ చారి

 

Latest Updates