బిస్కెట్లు తిన్న ఘటనలో..  మొత్తం ముగ్గురు చిన్నారుల మృతి

కర్నూలు: కిరాణా దుకాణంలో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తిన్న ఘటనలో మరో చిన్నారి మృతి చెందింది. అభం శుభం తెలియని  ముగ్గురు పసి పిల్లలు ఒకరి తర్వాత మరొకరు చనిపోవడంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో ఈనెల 13వ తేదీ ఆదివారం నాడు హుస్సేన్ బాషా దంపతులు పొలం పనులకు వెళ్లారు. వారి కుమారుడు హుస్సేన్ భాష (6), కూతురు హుసెన్ బీ (4)తో పాటు చిన్న హుసెన్ బాష కూతురు జమాల్ బి  ముగ్గురు కలసి సాయంత్రం ఇంటి సమీపంలోని ఓ దుకాణంలో రోజ్ మ్యాంగో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని  తిన్నారు. కొద్దిసేపటికే ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. పొలం నుంచి వచ్చిన తల్లి దండ్రులు పిల్లల పరిస్థితిని గుర్తించి వెంటనే ఆళ్లగడ్డ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యమైందేమో వైద్యుల ప్రయత్నాలు ఫలించక హుస్సేన్ బాషా (6) చనిపోయాడు. మిగిలిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హుసెన్ బీ చనిపోయింది.

ఇవాళ తెల్లవారుజామున జమాల్ బి అనే చిన్నారి కూడా ఆసుపత్రిలో కన్ను మూసింది. విషయం తెలిసిన వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న ఆళ్లగడ్డ  లోని లింగమయ్య వీధిలో ముగ్గురు చిన్నారులు బిస్కెట్ ప్యాకెట్ కొనుకున్న దుకాణాన్ని తనిఖీ చేశారు. ఘటనపై ఆరా తీశారు. రోజ్ మ్యాంగో బిస్కెట్ లు హోల్ సేల్ సరఫరా చేసే ఓ ఏజెన్సీ దుకాణాన్ని గుర్తించి సీజ్ చేశారు. తనిఖీలన్నీ పూర్తయి వాస్తవాలు నిర్ధారణ అయ్యే వరకు గ్రామంలోని  తల్లిదండ్రులు ఎవరూ పిల్లలకు దుకాణాల్లో అమ్మే తినుబండారాలు తినిపించొద్దని ప్రకటించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఫుడ్ కంట్రోల్ అధికారులు చెప్పారు.

Latest Updates