బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఎలాంటి సంబంధం లేదు

హైదరాబాద్ బోయిన్ పల్లిలో సీఎం కేసీఆర్ బంధువు, మాజీ టెన్నిస్‌ ప్లేయర్ ప్రవీణ్‌రావు, అతని సోదరుడి కిడ్నాప్‌ ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసులో ఏవీ సుబ్బారెడ్డి ఏ1గా, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ ఏ2గా, ఆమె భర్త భార్గవ్ రామ్ ఏ3గా కేసు నమోదైంది. ఇప్పటికే భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం మాదాపూర్‌లోని తన నివాసంలో ఉన్న ఏబీ సుబ్బారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు.

ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన సుబ్బారెడ్డి.. తనను ఎందుకు ఏ1గా చేర్చారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ప్రవీణ్‌రావుతో విభేదాలు ఉన్నది వాస్తవమేనని.. హఫీజ్‌పేట్‌ భూ వివాదంపై ఇప్పుడు మాట్లాడలేను అని అన్నారు. అఖిలప్రియ నన్ను చంపడానికి సుపారీ ఇచ్చిందని గతంలో కేసు పెట్టా… అలాంటి వారితో కలిసి నేనెందుకు కిడ్నాప్‌ చేయిస్తా అని అన్నారు. ఈ కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పిన సుబ్బారెడ్డి..తనకు ఎలాంటి ప్రాణ హాని లేదన్నారు.  పోలీసుల విచారణలో అన్ని విషయాలను చెబుతానన్నారు.

Latest Updates