సిటిజన్​షిప్​కు ఆధార్​ ప్రూఫ్​ కాదు

సిటిజన్​షిప్​కు ఆధార్​ ప్రూఫ్​ కాదు

నివాస గుర్తింపు మాత్రమే
తెలంగాణ పోలీసుల రిపోర్ట్​ ఆధారంగానే  
127 మందికి నోటీసులు
తప్పుడు పత్రాలతో  తీసుకుంటే ఆధార్​ రద్దు
అక్రమ వలసదారులకు ఆధార్​ ఇవ్వొద్దని
సుప్రీం చెప్పింది. వివరణ ఇచ్చిన యూఐడీఏఐ
బాధితుల తరఫున పోరాటం చేస్తామన్న అడ్వొకేట్ జేఏసీ

హైదరాబాద్​, వెలుగు: ఆధార్​ కార్డు పౌరసత్వానికి ఆధారం కాదని యూఐడీఐ స్పష్టం చేసింది. పౌరసత్వంతో దానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. దేశంలో ఓ వ్యక్తి నివాస ప్రాంతాన్ని ధ్రువీకరించేది మాత్రమేనని పేర్కొంది. తప్పుడు డాక్యుమెంట్లతో ఆధార్​ కార్డు పొందారన్న ఆరోపణలతో హైదరాబాద్​కు చెందిన 127 మందికి ఆధార్​ రీజనల్​ ఆఫీస్​ నోటీసులు ఇచ్చిందన్న కథనాలపై బుధవారం యూఐడీఏఐ వివరణ ఇచ్చింది. తెలంగాణ పోలీసులు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగానే ఒరిజినల్​ పత్రాలు చూపించేందుకు గురువారం హాజరవ్వాల్సిందిగా రీజనల్​ ఆఫీస్​ నోటీసులు ఇచ్చిందని, ఒకవేళ వాళ్లు అక్రమంగా వలస వచ్చిన వాళ్లే అయితే ఆధార్​ చట్టం ప్రకారం వాళ్ల ఆధార్​ను రద్దు చేయొచ్చని చెప్పింది. అక్రమ వలస దారులకు ఆధార్​ ఇవ్వొద్దని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసింది. నోటీసులు అందుకున్నోళ్లు సరైన పత్రాలను చూపించలేకపోయినా, తప్పుడు డాక్యుమెంట్లతో ఆధార్​ తీసుకున్నా, ఆ తప్పు తీవ్రతను బట్టి ఆధార్​ను సస్పెండ్​ చేయడమో లేదా రద్దు చేయడమో జరుగుతుందని పేర్కొంది. ఆధార్​ నోటీసులకు, పౌరసత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. ఆధార్​ రద్దు చేసినంత మాత్రాన జాతీయత పోదని పేర్కొంది. క్వాలిటీ ఇంప్రూవ్​మెంట్​లో భాగంగా ఎప్పుడూ తీసుకునే చర్యల్లో భాగమే ఇదని చెప్పింది. హైదరాబాద్​ వాళ్లకు ఇచ్చిన నోటీసులూ అలాంటివేనని చెప్పింది.

ఆ హక్కు ఆధార్​కు లేదు​

ప్రజల పౌరసత్వాన్ని పరిశీలించే అధికారం ఆధార్​ సంస్థకు లేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ మండిపడ్డారు.  నోటీసులు ఇచ్చిన వాళ్లలో ముస్లింలు, దళితులు ఎంతమందున్నారని ప్రశ్నిస్తూ తెలంగాణ పోలీస్​, ఆధార్​ సంస్థను ట్యాగ్​ చేశారు. రాష్ట్ర డీజీపీ సమాధానం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్డన్​ సెర్చ్​ చేసే సమయంలో పోలీసులు ఆధార్​ కార్డు అడగడం మానేయాలని, వాటిని అడిగే హక్కు, చట్టబద్ధత లేదన్నారు. మైనారిటీలు, దళితులే టార్గెట్​గా వేధింపులకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే వారికి నోటీసులు జారీ చేసి అన్ని గుర్తింపు పత్రాలను మళ్లీ పరిశీలిస్తామంటున్నారని మండిపడ్డారు. ఆధార్​ సంస్థ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. నోటీసును జారీ చేసిన డిప్యూటీ డైరెక్టర్​ను సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేశారు. సీఏఏ, ఎన్నార్సీ కోసం పౌరుల వివరాలు తెలుసుకునే అధికారం ఆధార్​ ఎన్​రోల్​మెంట్​ డైరెక్టర్​ జనరల్​ లేదని అడ్వొకేట్స్​ జేఏసీ కన్వీనర్​ వలీ ఉర్​ రెహమాన్​ అన్నారు. భవానీనగర్​కు చెందిన ఆటో డ్రైవర్​ సత్తార్​కు వచ్చిన నోటీసులతో పాటు మరికొంత మందికి వచ్చిన నోటీసుల ఆధారంగా హైకోర్టులో పిటిషన్​ వేస్తామని, న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

ఇదీ జరిగింది

ఫేక్​ డాక్యుమెంట్లతో ఆధార్​ కార్డు పొందారన్న ఆరోపణలతో ఈ నెల 3న భవానీ నగర్​కు చెందిన ఆటో డ్రైవర్​ మహ్మద్​ సత్తార్​ సహా 127 మందికి హైదరాబాద్​లోని ఆధార్​ రీజనల్​ ఆఫీస్​ (ఆర్వో) నోటీసులు ఇచ్చింది. ఆర్వో డిప్యూటీ డైరెక్టర్​ (ఎంక్వైరీ) అమిత్​ బింద్రో నోటీసులు ఇచ్చారు. సరైన డాక్యుమెంట్లు తీసుకుని గురువారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్​లోని మెగా గార్డెన్స్​లో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకపోయినా, సరైన డాక్యుమెంట్లు చూపించకపోయినా ఆధార్​ను రద్దు చేస్తామని పేర్కొన్నారు.

see also: భారతీయుడు2 షూటింగ్​లో ప్రమాదం

రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు ఆగింది!

సర్కార్ ఫోకస్ : రిటైర్మెంట్​ ఏజ్​ 61