ఈడ ఉండం..మా ఊరికే పంపండి

  • పునరావాస కేంద్రంలో కొలాంగొందిగూడా ఆదివాసీల నిరసన
  • అన్నం నీరు ముట్టకుండా నిరాహార దీక్ష
  • సముదాయించిన కలెక్టర్ , ఎస్పీ
  • ఆఫీసర్ల తీరుపై జడ్పీ చైర్‌ పర్సన్ కోవ లక్ష్మి ఆగ్రహం

ఆసిఫాబాద్, వెలుగు: మమ్మలి మా ఊరికే పంపించండని… ఇక్కడ ఉండలేమని కోలాంగొందిగూడ ఆదివాసీలు ప్రభుత్వం కల్పించిన పునరావాస కేంద్రంలో అన్నం నీరు ముట్టకుండా నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పు మేరకు ఫారెస్ట్ ఆఫీసర్లు బుధవారం 16 కుటుంబాల్లో 10 కుటుంబాలను వాంఖిడి బీసీ హాస్టల్ల్లో, ఆరు కుటుంబాలను సెరికల్చర్ ఆఫీల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. సెరికల్చర్ ఆఫీస్కు తరలించిన కుటుంబాలు తాము తమ పాత ఊరికే పోతామని, ఇక్కడ మాత్రం ఉండమని ఉదయం నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా పునరావాస కేంద్రం బయట నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.

ఆరు కుటుంబాలకు చెందిన అందరూ అన్నపానీయాలు మానేసి నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలుసుకున్న కుమ్రం భీమ్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ మల్లారెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి దిలీప్ కుమార్తో కలిసి ఆదివాసీల వద్దకు వెళ్లారు. మీకు అన్ని విధాలా మెరుగైన పునరావాసం, మంచి వసతులు  కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే తమకు ఏలాంటి సౌకర్యాలు వద్దని తమ పాత గ్రామానికే వెళ్తామని, అక్కడ మమ్మల్ని కాపాడే దేవత ఉందన్నారు. గొడ్డూ, గోద అన్నీ అక్కడ ఉన్నాయని ఇక్కడ ఏం ఉందని ఉండాలన్నారు. దీంతో అప్పటికప్పుడు కలెక్టర్ జైత్పూర్ శివారులో వారికి సాగు భూమిని చూపించారు. ఇందుకు 10 కుటుంబాలు ఒప్పుకోగా, నిరసన వ్యక్తం చేస్తున్న ఆరు కుటుంబాలు ససేమిరా అన్నాయి. వీరిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

గిరిజనులపై దౌర్జన్యం చేస్తారా?

ఆదివాసీ గిరిజనుల పట్ల ఫారెస్ట్‌ ఆఫీసర్లు వ్యవహరిం చిన తీరు బాధాకరమని జడ్పీచైర్‌ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. అన్నపానీయాలు మానేసి ఆందోళన చేస్తు న్న వారిని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె అటవీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావాసం కల్పిం చకుండా ఇండ్లు ఎలాకుల్చివేస్తారని  ప్రశ్నించారు. ఈ 16 కుటుంబాలతో అడవులకు అంతగా నష్టం జరిగిందా అని అన్నారు.

వారానికి ‘పునరావాసానికి’

ఎట్టకేలకు కొలంగొందిగూడ ఆదివాసీల తరలింపు

వాంకిడిలోని బీసీ హాస్టల్కు తీసుకెళ్లిన ఫారెస్ట్ ఆఫీసర్లు

కాగజ్నగర్, వెలుగు:  వారం రోజుల తర్వాత కొలాంగొందిగూడ ఆదివాసీలను పునరావాస కేంద్రానికి తరలించారు. కాగజ్నగర్ సమీపంలోని అంకుశం పంచాయతీ కొలాంగొందిగూడ రిజర్వు ఫారెస్ట్లో ఉందని అటవీశాఖ అధికారులు ఈనెల12న  అక్కడి ఇళ్లు కూల్చివేసి 16 కుటుంబాలను తీసుకువచ్చి వేంపల్లి టింబర్డిపోలో చెట్ల కింద ఉంచారు. ఆదివాసీల పట్ల ఫారెస్ట్ ఆఫీసర్ల చర్యలపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. వారిని టింబర్డిపోలో చెట్ల కింద ఉంచడంపై పౌర హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు చీఫ్ జస్టిస్ వెంటనే వారిని తన ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఆయన ఆదివాసీలతో మాట్లాడి వారికి వాంకిడిలోని బీసీ హాస్టళ్లలో పునరావాసం కల్పించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ ఆఫీసర్లు వాంకిడిలోని బీసీ హాస్టల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి బుధవారం ఉదయం తరలించారు. అయితే  కొలాంగొందిగూడ ఆదివాసీల్లో గోండు వర్గానికి చెందిన వారు తమకు వాపస్ గొందిగూడ గ్రామంలో పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తుండగా, కొలాం వర్గం వారు మాత్రం ఎక్కడిచ్చిన సరే అంటున్నారు.

 

Latest Updates