ఆప్ ఎమ్మెల్యే పై ఇంక్ దాడి

ఉత్తర ప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై దాడి జరిగింది. యూపీలోని ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించేందుకు రాయ్ బరేలీ లో ప్రభుత్వ అతిథి గృహం నుంచి బయటకు వస్తున్న ఆయన ముఖంపై ఓ వ్యక్తి సిరా చల్లాడు. మరోవైపు.. ఈ ఘటన తర్వాత పోలీసులు సోమనాథ్ భారతిని అరెస్టు చేశారు. యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ అదుపులోకి తీసుకున్నారు. నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం, వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించేలా వ్యవహరించినందుకుగాను అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. ఆ తర్వాత సోమనాథ్ భారతిని అమేథీకి తరలించారు. దీంతో పాటు ఆయనపై జరిగిన సిరా దాడిపై కూడా విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

యూపీ సర్కార్ చర్యను ఆప్ ఖండించింది. సోమనాథ్ భారతిపై సిరా దాడి ఆందోళనకు గురిచేసిందన్నారు ఆప్ నేత సంజయ్ సింగ్. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. భారతిపై దాడిని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుబట్టారు. ఇలాంటి దాడులు మానుకొని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఏర్పాటుపై సర్కారు  దృష్టిసారించాలని సూచించారు.

Latest Updates