పెన్షన్‌దారులకు షాక్.. ఓటర్​ లిస్టులో పేరు ఉంటేనే పెన్షన్

ఆసరా పెన్షన్లను 57 ఏండ్లు నిండినవాళ్లందరికీ అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. లబ్ధిదారుల ఎంపికలో మాత్రం ట్విస్ట్​ పెట్టింది. ఇప్పటికిప్పుడు 57 ఏండ్లు నిండినవాళ్లకే కాదు, ఏడాదిన్నర కింద 57 ఏండ్లు నిండినవాళ్లకు కూడా ఆ పెన్షన్లు వచ్చే చాన్స్​ లేదు. కొత్త లబ్ధిదారుల ఎంపిక కోసం 2018 అసెంబ్లీ ఎన్నికల ఓటర్​ లిస్టును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే 2018 నవంబర్​కు ముందు 57 ఏండ్లు నిండినవాళ్లే లబ్ధిదారులు కానున్నారు. ఈ నిర్ణయంతో మూడున్నర లక్షల మంది పెన్షన్​ అవకాశాన్ని కోల్పోనున్నారు.

రాష్ట్రంలో 2018 డిసెంబర్​ 7న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం 2018  నవంబర్​ చివరి నాటికి ఓటరు లిస్టును రెడీ చేసింది. ఆ లిస్టు ప్రాతిపదికన ఆసరా కొత్త లబ్ధిదారులను ఎంపిక జరిగిపోయిందని  ఓ సీనియర్​ ఆఫీసర్​ తెలిపారు. అయితే.. ప్రభుత్వ పథకాల అమలు కోసం ఓటరు లిస్టుపై ఆధారపడటం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హులైన లబ్ధిదారుడి పేరు ఓటరు లిస్ట్ లో  లేకపోతే ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  ‘నవంబర్​ 2018 ఓటరు లిస్టును కట్ ఆఫ్ డేట్ గా తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. వారి డైరెక్షన్ మేరకు కొత్త లబ్ధిదారులను గుర్తించాం. ఆ ఓటరు లిస్టులో పేరు లేకపోతే ఏం చేయాలో మాకు ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వలేదు’ అని ఓ సీనియర్​ ఆఫీసర్​ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2018 నవంబర్​ తర్వాత నుంచి ఇప్పటి వరకు దాదాపు 3.5 లక్షల మంది 57 ఏండ్లు దాటినవారు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వీరిని కొత్త లబ్ధిదారుల జాబితాలో చేర్చాలా వద్దా.. అనే దానిపై ఎలాంటి డైరెక్షన్స్ లేవని అంటున్నాయి. 60 ఏండ్లు నిండిన వారికి కూడా దాదాపు 8 నెలలుగా పెన్షన్లు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

కొత్త లబ్ధిదారులు 8.5 లక్షల మంది

57 ఏండ్ల వయసు నిండిన ఆసరా కొత్త లబ్ధిదారులు సంఖ్య 8 లక్షల 59 వేల 793 మందిని ఆర్థికశాఖ గుర్తించింది. అసెంబ్లీ ఎన్నికల ఓటరు లిస్టు ఆధారంగానే వీటిని లెక్కగట్టినట్లు తెలుస్తోంది. వీరందరికి ఏప్రిల్​ 1 నుంచి ఆసరా పెన్షన్లు ఇస్తామని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రతి నెల 39,41,976 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. కొత్త లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వడం వల్ల ఏటా ప్రభుత్వంపై అదనంగా రూ. 2,356 కోట్ల భారం పడనుంది. ఈ మొత్తాన్ని 2020–-21 బడ్జెట్ లో ప్రభుత్వం కేటాయించింది.

గ్రేటర్​ ఎలక్షన్​ ముంగిట అమలు

కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత తన ఎన్నికల హామీని అమలు పరుస్తున్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ దారుల వయసును 57ఏండ్లకు కుదిస్తామని, ఆసరా పెన్షన్ల మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు. 2019  జులైలో పెన్షన్ మొత్తాన్ని పెంచారు తప్ప వయోపరిమితిని తగ్గించలేదు. 57 ఏండ్లు నిండినవాళ్లకు 2020‌‌‌‌–21ఆర్థిక సంవత్సరంలో ఆసరా పెన్షన్​ ఇస్తామని బడ్జెట్​లో ప్రభుత్వం చెప్పింది. అయితే.. ఈ ఏడాది చివరి నాటికి గ్రేటర్ హైదరాబద్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. గ్రేటర్ పరిధిలో సుమారు మూడు లక్షల మంది 57 ఏండ్లు నిండినవారు ఉంటారు. వీరందరికీ కొత్తగా పెన్షన్ ఇస్తే కొత్త ఓటు బ్యాంకు వస్తుందని ప్రభుత్వం అంచనా వేసి.. ప్రస్తుత బడ్జెట్​లో హామీ అమలుకు ప్రకటన చేసినట్లు చర్చ జరుగుతోంది.

 

Latest Updates