112 ఎకరాల అవినీతి కేసులో మాజీ క‌లెక్ట‌ర్ పాత్ర‌?

లంచం తీసుకుంటూ మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన సంగ‌తి తెలిసిందే. అధికారుల‌ దర్యాప్తులో సంచలన విషయాలు బ‌య‌ట‌పడుతున్నాయి. ఈ కేసులో మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పాత్ర ఉందా అనే దానిపై ఏసీబీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. జులై 31న రిటైర్ మెంట్ అయిన‌ ధర్మా రెడ్డి… అదే రోజు..బాధితుడు మూర్తికి ఇవ్వాల్సిన ఎన్ వోసీ ఫైల్ పై సంతకం చేసినట్లు తెలుస్తోంది.

చిప్పల్ తుర్తి గ్రామంలోని సర్వే నెంబర్ 58,59 లోని వివాదస్పద 112.21 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో నుంచి తీసివేయాలని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ కు మాజీ కలెక్టర్ ధర్మా రెడ్డి లేఖ‌ రాసినట్టు తెలిసింది. కలెక్టర్ ఆదేశాల ప్రకారం 112.21 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని జిల్లా రిజిస్ట్రార్ కు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

రిటైర్మెంట్ రోజునే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ కు లేఖ రాయడం, కలెక్టర్ ధర్మా రెడ్డి పేరు తో లెటర్ లభ్యం కావడం తో పాత్ర పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు ఏసీబీ అధికారులు అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ ను ఏసీబీ ప్రధాన కార్యాల‌యానికి తరలించారు. మరి కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్ట్ లో ప్రవేశ పెట్టనున్నారు.

Latest Updates