హేమంత్ ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి: అవంతి

సంచలనం సృష్టించిన హేమంత్ పరువు హత్య కేసులో నిందితుల సంఖ్య 21 కి పెరిగింది. ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రీసెంట్ గా పరారీలో ఉన్న కృష్ణ, బాషా, జగన్ , సయ్యద్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు హేమంత్  భార్య అవంతి సోదరుడు ఆశిష్ రెడ్డి, సందీప్ తో పాటు మరో వ్యక్తిని విచారిస్తున్నారు. నిందితుడు కృష్ణ…. అవంతి మేనమామ యుగంధర్ రెడ్డితో కలిసి హత్యకు డీల్ చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. హత్య తర్వాత నిందితులకు జగన్, సయ్యద్  లు సహకరించినట్లు చెప్తున్నారు.

హేమంత్ ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఆయన కుటుంబ సభ్యులు. హైదరాబాద్ చందానగర్ లోని ఇంటి మందు వారు నిరసనకు దిగారు. ఇంటి నుంచి ర్యాలీగా బయల్దేరిన హేమంత్ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ర్యాలీకి అనుమతి లేదని చెప్పడంతో రోడ్డుపై బైఠాయించారు హేమంత్ భార్య అవంతి, అతని ఫ్రెండ్స్. హేమంత్ ను దారుణంగా హత్య చేసిన  వారిని వదిలిపెట్టొద్దన్నారు ఆయన భార్య అవంతి. మరొకరికి ఇలాంటి పరిస్థితి రావొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు హేమంత్ సోదరుడు సుమంత్.

హేమంత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు సీపీఐ జాతీయ నేత నారాయణ. హేమంత్ ఘటనే చివరిది కావాలన్నారు. న్యాయం జరిగేంత వరకు హేమంత్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. రోడ్డుపై నిరసన తెలుపుతున్న హేమంత్ ఫ్యామిలీకి మద్దతు తెలిపారు నారాయణ. దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాడ్ చేశారు.

హేమంత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు లాయర్ కల్యాణ్ దిలీప్. చందానగర్ లోని హేమంత్ ఇంటికి వచ్చిన ఆయన…. అవంతితో పాటు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పక్కా సాక్ష్యాధారాలతో నిందితులందరికీ శిక్ష పడేలా చేస్తామన్నారు లాయర్ దిలీప్.

హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు హేమంత్ ఫోన్ కనిపించడం లేదు. ఫోన్ దొరికితే కేసులో ఇంకిన్ని ఆధారాలు వస్తాయంటున్నారు పోలీసులు.

Latest Updates