ఎసిడిటీ మాత్రలతో కిడ్నీ కరాబ్

అట్టపై హెచ్చరికలు తప్పనిసరి

కడుపులో మంట.. గ్యాస్ ట్రబుల్.. అజీర్తి లాంటి సమస్యలు ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయాయి. జీవన శైలి, షిఫ్ట్ ఉద్యోగాలు, నిద్ర సమస్యలు, టెన్షన్లతో కడుపుపై ఎఫెక్ట్ పడుతోంది. దీంతో కడుపులో మంటగా అనిపిస్తే చాలు ఎసిడిటీ మాత్రలు తెచ్చుకుని వేసేసుకుంటున్నారు చాలా మంది. ఇలాంటి వాళ్లందరికీ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్త!!

తాత్కాలికంగా రిలీఫ్ కోసం వాడే ఈ టాబ్లెట్స్ వల్ల ఆరోగ్యంపై పెద్ద దెబ్బ పడడం ఖాయం. శరీరంలో కీలక అవయవాల్లో ఒకటైన కిడ్నీ కరాబ్ అవుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ‘అక్యూట్ కిడ్నీ ఇన్‌జ్యురీ’.. అంటే లోలోపల కిడ్నీ దెబ్బతిని.. ఒక్కసారిగా పని చేయకుండా మానేసే స్థితిలోకి వెళ్లిపోతుందని వారి ప్రయోగాల్లో వెల్లడైంది.

అప్రమత్తమైన భారత డ్రగ్ కంట్రోల్ బోర్డు

ఎసిడిటీ మాత్రల ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియడంతో భారత్ డ్రగ్ కంట్రోల్ బోర్డు అప్రమత్తమైంది. ప్రజల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని అన్ని రాష్ట్రాల ఔషధ నియంత్రణ బోర్డులకు మార్గదర్శకాలను జారీ చేశారు నేషనల్ డ్రగ్ కంట్రోలర్ జనరల్. టాబ్లెట్స్ అట్టపై తప్పనిసరిగా ‘అక్యూట్ కిడ్నీ ఇన్‌జ్యురీ’ బారిన పడుతారని హెచ్చరికల్ని ముంద్రించాలని ఆదేశించారు. ఎసిడిటీ మాత్రల తయారీ కంపెనీలన్నీ దీన్ని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల బోర్డులకు సూచనలు పంపారు.

ఆ మాత్రలివే

డ్రగ్ కంట్రోలర్ జనరల్ కొన్ని మాత్రల పేర్లను కూడా తన మార్గదర్శకాల్లో ఉంచారు.

పాంటాప్రజోల్, ఒమెప్రజోల్, లాన్సోప్రజోల్, ఎసొమెప్రజోల్ సహా వాటి కాంబినేషన్లతో వచ్చే అన్ని మాత్రల విషయంలో ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరించారు.  ప్రస్తుతం ఏ సమస్యతో ఆస్పత్రికి పోయినా దానికి ఇచ్చే టాబ్లెట్లతో పాటు గ్యాస్ మాత్రలు కూడా ఇస్తున్నారు. వీటి వినియోగంపై కంట్రోల్ అవసరమని ఔషధ నియంత్రణ బోర్డు సూచించింది.

Latest Updates