పుల్వామా ఘటనపై ప్రతీకారానికి కేంద్రం యాక్షన్ ప్లాన్

పుల్వామా ఘటనపై సీరియస్ గా ఉన్న కేంద్రం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఢిల్లీలో హోం, రక్షణ , విదేశాంగ శాఖల ప్రతినిధులు కార్యాచరణలో బిజీగా మారారు. ద్వైత్వపరంగా పాక్ ను ఏకాకిని చేస్తూనే.. సైనిక చర్య దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 24 గంటల్లోనే ఉగ్రవాదులకు మూడోసారి వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. పుల్వామా కారకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని చెప్పారు. భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామన్న ప్రధాని.. అమరుల కుటుంబాల కన్నీళ్లకు బదులు తీర్చుకుంటామని స్పష్టం చేశారు.

ఉగ్రవాదంపై పోరులో కేంద్రానికి మద్దతుగా నిలిచాయి విపక్షాలు. హోంశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై తీర్మానం చేశాయి. సాయుధ బలగాలకు స్వేచ్ఛనివ్వాలని సూచించిన విపక్షాలు.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలన్నారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశం మొత్తం ఒక్కటిగా ఉందన్నారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. శాంతిని కోరుకునే కశ్మీర్ పౌరులంతా భారత్ వైపే ఉన్నారన్నారు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్.

జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించేందుకు చైనాతో చర్చలు జరపాలన్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ DS హుడా. మసూద్ అజహర్ విషయంలో చైనా మొండిగా వ్యవహరిస్తోందన్నారు. పల్వామా దాడి గురించి తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ. ఉగ్రవాదమనే సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపెట్టాలని మాత్రమే తాను చెప్పానన్నారు.

మరోవైపు ఉగ్రవాదంపై పోరులో భారత్ కు ప్రపంచ దేశాల నుంచి భారీగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే 50 దేశాలకు పైగా ప్రతినిధులు ఉగ్రదాడిని ఖండించారు. యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బాల్టన్.. పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు. పాక్ భూభాగం నుంచి కార్యాకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ సహా ఇతర ఉగ్రవాద సంస్థలను ఏరివేయాలని చెప్పారు. NSA అజిత్ దోవల్ తో ఫోన్ లో మాట్లాడిన జాన్ బోల్టన్.. భారత్ చేపట్టే ఆత్మరక్షణ చర్యలను సమర్థిస్తామన్నారు.

 

 

Latest Updates