పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకపోయినా శబరిమల వస్తా: తృప్తి

  • సుప్రీం తీర్పు ప్రకారం అయ్యప్ప దర్శనం నా హక్కు అని వ్యాఖ్య

కేరళ ప్రభుత్వం పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా తాను శబరిమల వచ్చితీరుతానని స్పష్టం చేశారు మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తి దేశాయ్. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఏమీ ఇవ్వలేదని, మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకోవచ్చని ఆమె అన్నారు. శుక్రవారం కేరళ దేవస్వం మంత్రి కె.సురేంద్రన్ ఇచ్చిన ప్రకటనకు కౌంటర్‌గా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

తృప్తిని సున్నితంగా హెచ్చరించిన మంత్రి

శబరిమల వంటి పుణ్యక్షేత్రంలో శాంతిని కోరుకుంటున్నామని, అయ్యప్ప దర్శనానికి వచ్చే మహిళలకు తమ ప్రభుత్వం పోలీసు ప్రొటక్షన్ ఇవ్వబోదని స్పష్టం చేశారు మంత్రి సురేంద్రన్. అలాగే తృప్తి దేశాయ్‌ని సున్నితంగా హెచ్చరించారాయన. ‘మీ బల ప్రదర్శనకు శబరిమల లాంటి పుణ్య క్షేత్రాన్ని వేదికగా ఎంచుకోవద్దు’ అని సూచించారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి రావద్దని, ఒకవేళ రావాలని నిర్ణయించుకుని.. పోలీస్ ప్రొటెక్షన్ కావాలనుకుంటే సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలని చెప్పారు సురేంద్రన్.

సుప్రీం కోర్టును అగౌరవపరచడమేనన్న తృప్తి

కేరళ మంత్రి సురేంద్రన్ వ్యాఖ్యలు సుప్రీం కోర్టును  అగౌరవపరచడమేనని అన్నారు తృప్తి దేశాయ్. 2018 సెప్టెంబరు 28న ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ల విచారణ సందర్భంగా స్టే ఏమీ ఇవ్వలేదన్నారామె. సుప్రీం తీర్పు మేరకు మహిళలకు అయ్యప్పను దర్శించుకునే హక్కు ఉందని చెప్పారు. పోలీసు ప్రొటెక్షన్ కావాలంటే కోర్టు ఆర్డర్ తెచ్చుకోవాలనడం తగదని అన్నారు తృప్తి దేశాయ్.

ఎటూ తేల్చని కోర్టు

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నిషేధం పాటించాలన్నది ఆలయ సంప్రదాయం. కానీ దీనిపై కొందరు మహిళలు ఇది లింగ వివక్ష అంటూ, తమ ప్రాథమిక హక్కుకు భంగం కలుగుతోందంటూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. దీనిపై సుదీర్ఘ విచారణ తర్వాత 2018 సెప్టెంబరు 28న నిషేధం ఎత్తేయాలంటూ తీర్పు ఇచ్చింది. దీంతో నిరసనలు వెల్లువెత్తాయి. మూడు నెలల తర్వాత జనవరిలో కొంత మంది మహిళలు దర్శనం చేసుకున్నారు. అయితే దీనిపై అప్పట్లోనే రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన సుప్రీం ధర్మాసనం ఎటూ తేల్చలేదు. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం సహా ఇతర మతపరమైన అంశాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం పరిశీస్తుందని గురువారం తీర్పు వెల్లడించింది.

 

Latest Updates