కరోనాతో సీనియర్‌ నటి ఆశాలత వబ్గావోంకర్ కన్నుమూత

బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. కరోనా వైరస్ సోకి సీనియర్‌ నటి, ప్రముఖ థియేటర్‌ ఆర్టిస్టు ఆశాలత వబ్గావోంకర్ (79) చనిపోయారు. గత కొన్ని రోజులుగా సతారాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ(మంగళవారం) తుదిశ్వాస విడిచారు. కరోనాతో మృతిచెందిన ఆశాలత అంత్యక్రియలు సతారాలో నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఇటీవలే ఓ మరాఠీ సీరియల్‌ షూటింగ్‌ కోసం సతారాకు వెళ్లిన ఆమెకు కరోనా సోకిందని, సోమవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ఆశాలత మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

గోవాకు చెందిన ఆశాలత మొదట కొంకణి, మరాఠీ భాషల్లో వందలాది నాటకాల్లో విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఆ తర్వాత సినీ రంగంలో ప్రవేశించి పలు మరాఠీ సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో బసు ఛటర్జీ అప్నే పరాయే సినిమాతో హిందీ తెరకు పరిచయం చేశారు. అంకుఖ్‌, అహిస్తా అహిస్తా వో సాత్ దిన్‌, నమక్‌ హలాల్‌ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Latest Updates