బాలీవుడ్‌లోకి ప్రభాస్ ఛత్రపతి.. హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్

‘అల్లుడు శీను’ సినిమాతో 2014లో సినీరంగ ప్రవేశం చేసి.. అతి తక్కువ సినిమాలతోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఎన్నో యాక్షన్ సినిమాలకు దర్శకత్వం వహించిన వీవీ వినాయక్ దర్శకుడిగా, పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ నిర్మాతగా ఈ సినిమా రూపొందిద్దుకోబోతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రియ హీరోహీరోయిన్లుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ సినిమాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ హిందీలో రూపొందించబోతున్నారు. పెన్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో సాయి శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయబోతున్నారు. సాయి శ్రీనివాస్‌ను తెలుగులో మొదటగా పరిచయం చేసిన దర్శకుడు వీవీ వినాయక్. ఇప్పడు బాలీవుడ్‌లోకి కూడా ఆయనే పరిచయం చేయడం విశేషం. అంతేకాకుండా వీవీ వినాయక్‌ కూడా ఈ సినిమాతోనే బాలీవుడ్ రంగప్రవేశం చేయబోతున్నారు.

‘ఛత్రపతి’ లాంటి గొప్ప సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి మాకు ఒక మంచి నటుడు కావాలనుకున్నాం. అయితే శ్రీనివాస్‌ను చూసిన తర్వాత ఆయన అయితే ఈ ప్రాజెక్ట్ చాలా గొప్పగా వస్తుందని అనుకున్నాం. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరోకు ‘ఖైదీ నెం 150’తో మంచి రీఎంట్రీ ఇచ్చిన వీవీ వినాయక్‌తో ఈ సినిమా తీయడం చాలా సంతోషంగా ఉంది’ అని పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ అన్నారు.

‘బాలీవుడ్‌లో నా అరంగేట్రానికి ఇది సరైన ప్రాజెక్ట్. డాక్టర్ జయంతి లాల్ మరియు పెన్ స్టూడియోస్‌తో కలిసి పనిచేయడం పట్ల చాలా సంతోషంగా ఉంది. నా మొట్టమొదటి దర్శకుడు వి.వి.వినాయక్ సార్‌ ఈ సినిమాకు దర్శకుడిగా పనిచేయడం నాకు కలిగిన గొప్ప అవకాశం. ప్రభాస్ చేసిన పాత్రను పోషించడం నాకు చాలా పెద్ద బాధ్యత. ఛత్రపతి హిందీ రీమేక్ నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని హీరో సాయి శ్రీనివాస్ అన్నారు.

For More News..

బఫెట్‌ను ఫాలోకావడమే నే చేసిన పెద్ద తప్పు

ఈ మాస్క్ ధర రూ. 7 లక్షలు.. ఎందుకో తెలుసా?

గ్రేటర్​లో టీఆర్ఎస్​కు నిరుద్యోగులు షాక్ ఇస్తరు!

Latest Updates