టీచర్ ఉద్యోగాన్ని వదిలి సినిమాల వైపు..

మంగళవారం తెల్లవారుతూనే ఓ దుర్వార్త
వెర్సటైల్‌ యాక్టర్ జయప్రకాష్ డ్డి (74) గుండెపోటుతో కన్నుమూశారని
ఈ యేడు మహా చెడ్డది. ఇప్పటికే ఎంతోమందిని దూరం చేసింది
ఇప్పుడు జయప్రకాష్ డ్డిని కూడా తీసుకెళ్లిపోయింది
సినీ పరిశ్రమని విషాదంలో ముంచేసింది
ప్రతి సినీ ప్రియుడి కళ్లల్లో చెమ్మను నింపింది

‘ఛీ పో.. గబ్బునాయాలా’ అన్న మాట వినగానే అందరికీ జయప్రకాష్‌రెడ్డి గుర్తొస్తారు. వెండితెరపై కోపంగా ఆయన తిట్టే తిట్టు కూడా అంతగా ఎంటర్‌‌టైన్ చేసింది మరి. తనదైన నటనతో.. తనకి మాత్రమే సొంతమైన మాడ్యులేషన్‌తో.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడాయన. అలాంటి విలక్షణ నటుడు ఇలా అర్ధంతరంగా అందరినీ వదిలి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.

పట్టుదలతో నటనవైపు..

జయప్రకాష్‌రెడ్డి సొంతూరు కర్నూలు జిల్లా సిరివెళ్ల. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్‌‌. ఆయన ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు ట్రాన్స్​ఫర్ కావడంతో జయప్రకాష్‌రెడ్డి చదువు పలుచోట్ల సాగింది. ఒకటి నుంచి పది వరకు నెల్లూరులో చదివారు. టెన్త్ క్లాస్‌లో ఉండగానే తండ్రికి అనంతపురం బదిలీ కావడంతో అక్కడ ఎస్‌ఎస్‌ఎల్సీ చేశారు. ఆపైన గుంటూరు ఏసీ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేసి, అక్కడే బీఈడీ కూడా చేశారు. గుంటూరు మున్సిపల్ స్కూల్లో టీచర్‌‌గా, హెడ్మాస్టర్‌‌గా పని చేశారు. అనంతపురంలో చదువుకునేటప్పుడు ఆ స్కూల్లో పని చేసే సైన్స్ టీచర్ చాలా కల్చరల్ యాక్టివిటీస్ ప్లాన్ చేసేవారు. ఆ ప్రభావం జేపీపై బాగా పడింది. ఓరోజు తన ఫ్రెండ్‌తో కలిసి ‘దుర్యోధన గర్వభంగం’ నాటికలోని పద్యాలు, డైలాగ్స్ బట్టీపట్టి మాస్టారుకి అప్పజెప్పేశారు. కానీ పొరపాట్లు దొర్లడంతో మళ్లీ నాటకాల పేరెత్తితే ఊరుకోనని టీచర్ కోప్పడ్డారు. దాంతో పట్టుదల పెరిగిపోయింది. నటుడినై తీరాలని నిర్ణయించుకున్నారు.

డ్రామా టు సినిమా

ఏసీ కాలేజ్‌లో ఉన్నప్పుడు ఓ సీనియర్‌‌ తమ నాటకంలో యాక్ట్ చేయమని అడిగితే సంతోషంగా ఒప్పుకున్నారు జయప్రకాష్‌రెడ్డి. ఆ నాటకం పేరు ‘స్టేజీ రాచరికం’. ఆయనది రాజసేవకి పాత్ర. ఆడవేషం అయినా కాదనకుండా చేశారు. నాటకం అయ్యాక ఆయన పేరు కాలేజీలో మార్మోగిపోయింది. యూనివర్శిటీ ఉత్తమ నటి అవార్డును కూడా ఇచ్చింది. అప్పట్నుంచి నాటకాలు వేయడం మొదలుపెట్టారు. కామెడీ రోల్స్ ఎక్కువగా చేసేవారు. జాబ్‌ చేసేటప్పుడు కూడా నటనను వదిలిపెట్టలేదు. రకరకాల నాటక పరిషత్తులతో కలిసి ఎన్నో నాటకాల్లో నటించారు. నల్గొండలో ‘గప్‌చుప్’ నాటకాన్ని ప్రదర్శిస్తుంటే దాసరి చూసి, వెళ్లి రామానాయుడుతో చెప్పారు. వెంటనే ఆయన హైదరాబాద్ పిలిచి ఆ నాటకం వేయమన్నారు. జేపీ నటనకు ఇంప్రెస్ అయ్యి ‘బ్రహ్మపుత్రుడు’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా వెండితెరపై తొలిసారి మెరిశారాయన.

కష్టాలను దాటుకుని..

ఒక నటుడిని కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటూ డివైడ్ చేసి చెబుతారు. కానీ తన విషయంలో ఆ అవకాశం ఇవ్వలేదు జయప్రకాష్‌రెడ్డి. అన్ని రకాల పాత్రలూ చేశారు. అయితే ఈ జర్నీ వెనుక ఎంతో స్ట్రగుల్ ఉంది. ‘బ్రహ్మపుత్రుడు’ సినిమా తర్వాత మంచి అవకాశాలు రాలేదు. కొన్ని వచ్చినా సరైన ఆదాయం లేదు. తొమ్మిదేళ్లు నానా కష్టాలూ పడ్డారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేననే భయంతో వెళ్లిపోయి టీచర్‌‌గా కంటిన్యూ అయ్యారు. స్కూల్లో పని చేస్తూనే ఉదయం, సాయంత్రం ట్యూషన్లు చెప్పేవారు. తర్వాత ఓసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు రామానాయుడు కలిసి ‘ప్రేమించుకుందాం రా’లో విలన్ రోల్ ఆఫర్ చేశారు. అది మంచి పేరు తెచ్చిపెట్టింది. కెరీర్‌‌ ఊపందుకుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాల్లో విలన్‌గా మెప్పించారు. ఆనందం, కబడ్డీ కబడ్డీ లాంటి సినిమాల్లో కమెడియన్‌గా కడుపుబ్బ నవ్వించారు. ఎన్నో సినిమాల్లో ఇంటిపెద్ద రోల్స్‌ చేసి ఈయన మనవాడు అనిపించారు. మూడు వందలకు పైగా సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ‘జయం మనదేరా’కి ఉత్తమ విలన్‌గా నంది అవార్డు కూడా అందుకున్నారు. మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో చివరిసారిగా కనిపించారు.

జయప్రకాష్‌రెడ్డి తర్వాత చాలామంది విలన్లు, కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇండస్ట్రీకి వచ్చారు. సక్సెస్ అయ్యారు. కానీ ఆయన స్థానం ఆయనదే. విలన్ పాత్రలో ఆయన నటన భయపెట్టింది. కమెడియన్ రోల్స్​లో ఆయన హాస్యం కడుపుబ్బ నవ్వించింది. ఇప్పుడాయన అస్తమయం అందరినీ కదిలించింది. మోడీ నుంచి మెగాస్టార్ వరకు ఆయన మృతికి విచారం వ్యక్తం చేశారు. ఆయనతో కలిసి నటించినవారంతా ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఆయన మరణం అందరి కళ్లూ చెమ్మగిల్లేలా చేసింది. ఇండస్ట్రీలో ఆయన మిగిల్చిన వెలితి.. ఎప్పటికీ ఎవ్వరూ తీర్చలేనిది.

ఎన్ని నాటకాలు వేసినా ‘అలెగ్జాండర్’ నాటకమంటే జయప్రకాష్ రెడ్డికి చాలా ఇష్టం. రకరకాల సమస్యలతో తనకి ఫోన్ చేసే జనాలకి, ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పరిష్కారాలు చూపించడమే ఈ నాటకంలోని కథ. వంద నిమిషాల పాటు ఒక్క పాత్రతోనే సాగుతుంది. ఆ పాత్రను అద్భుతంగా పోషించారు జేపీ. సినిమాలతో బిజీ అయిపోయి, నాటకాలకి టైమ్ దొరకని సమయంలో.. తనకోసం ఒకే ఒక్క పాత్రతో ఒక నాటకాన్ని రాయమని రచయిత పూసలని అడిగారట జేపీ. అప్పుడాయన రాసిందే ఈ ‘అలెగ్జాండర్‌‌’. తన జీవితకాలంలో అరవై ఆరు సార్లు ఈ నాటకాన్ని ప్రదర్శించారు జేపీ. నాటకాలకు ఆదరణ తగ్గడంతో ధవళ సత్యం డైరెక్షన్ లో సినిమాగా కూడా తీశారు. అది విడుదల కాకముందే కన్నుమూశారు.

రాయలసీమ యాసకి సినిమా వైభవాన్ని తెచ్చిపెట్టిన నటుడు జయప్రకాష్‌ రెడ్డి. ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో విలన్‌ పాత్ర చేసేటప్పుడు.. ఆ పాత్రకి సీమ శ్లాంగ్ వాడాలని ఫిల్మ్ మేకర్స్ అనుకోలేదు.  వాడితే బాగుంటుందని జేపీనే సలహా ఇచ్చారట. అందరూ ఓకే అనడంతో చాలా ప్రదేశాలు తిరిగి మరీ యాస మీద పట్టు సాధించారట జేపీ. స్వతహాగానే ఆయనకి తెలుగు భాషంటే చాలా ప్రేమ. కొత్త కొత్త తెలుగు పదాలు తెలుసుకోవడం ఆసక్తి. కవితలూ సామెతలూ సేకరించి పెట్టు కోవడం, పుస్తకాలు చదవడం, పజిల్స్ పూర్తి చేయడం వంటివి తనకిష్టమైన హాబీస్ అని ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పారు.

ప్రస్తుతం జయప్రకాష్‌ రెడ్డి గుంటూరులో ఉంటున్నారు. కాస్త షుగర్ లెవెల్స్ తక్కువ ఉండటం తప్ప ఆయనకి ఏ అనారోగ్యమూ లేదని, ఇంతలోనే ఇలా అయ్యిందని ఆయన భార్య రాధ కన్నీరు మున్నీరవుతున్నారు. కొంతకాలం క్రితం జేపీకి స్టంట్స్ వేశారు. అయినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ నిన్న ఉదయం బాత్ రూమ్ కి వెళ్లినప్పుడు సడెన్‌గా స్ట్రోక్ రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కొడుకు, కూతురు గుంటూరు, విజయవాడల్లో సెటిల్ కావడంతో పిల్లలకు దగ్గరగా ఉండేందుకు జేపీ కూడా గుంటూరులో సెటిలయ్యారు.

For More News..

టాలీవుడ్ డ్యాన్సింగ్‌ క్వీన్

Latest Updates