కొడుకు కోసం చేశా: నాని

  • ‘ది లయన్ కింగ్’ ట్రైలర్‌‌ రిలీజ్‌‌ ఈవెంట్‌‌లో నాని

తన కొడుకు కోసం ‘ది లయన్ కింగ్’ సినిమాలో సింబా పాత్రకు వాయిస్ ఇచ్చానని నేచురల్ స్టార్ నాని చెప్పారు. ఈ ఏడాది చేస్తున్న మిగతా చిత్రాలన్నీ తన కోసం, ప్రేక్షకుల కోసమని తెలిపారు. ఒక్క లయన్ కింగ్ మాత్రం తన కొడుకు కోసమే చేశానని వెల్లడించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ రిలీజ్ వేడుక మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రలైన స్కార్ కి జగపతిబాబు, ముఫాసాకి రవిశంకర్, పుంబాకి బ్రహ్మానందం, టిమోన్ కి ఆలీ, నాలాకి లిప్సిక డబ్బింగ్ చెప్పారు. నాని మాట్లాడుతూ ‘చాలా కాన్ఫిడెంట్ గా డబ్బింగ్ చెప్పేందుకు వెళ్లాను. కానీ జగపతిబాబు, రవిశంకర్ వాయిస్ విన్నాక నేను ఏం చెప్పినా తక్కువగానే ఉంటుందిగా అనిపించింది. కెరీర్లో నా సినిమాకు కాకుండా రెండేసార్లు డబ్బింగ్ చెప్పాను. ఒకటి మణిరత్నం కోసం, ఇప్పుడు డిస్నీ సంస్థ కోసం. బ్రహ్మానందం, ఆలీ గారి రోల్స్ చూస్తే జలసీగా అనిపించింది. ఎంతో ఫన్ ఉండే పాత్రలవి. ఈ సినిమా తెలుగులో చూడకపోతే చాలా ఎంటర్ టైన్ మెంట్ మిస్సవుతారు. చిన్నప్పుడు మనం చూసిన ‘ది లయన్ కింగ్’ కథే అయినా ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోంది.

అలాగే ‘గ్యాంగ్ లీడర్’ కూడా గొప్ప సినిమా. కానీ ఇప్పుడు నేను నటిస్తోన్న సినిమా కథ అది కాదు. అందుకే ఎలా స్వీకరిస్తారో అనే టెన్షన్ ఉంది’ అన్నారు. టాలీవుడ్, హాలీవుడ్ కు క్లోజ్ గా ఉందని తనకు అనిపిస్తోందని హీరో జగపతిబాబు అన్నారు. డిస్నీ సినిమా చూస్తే చాలనుకున్న తనకు వాళ్ల సినిమాకు డబ్బింగ్ చెప్పే చాన్స్ రావడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆలీ చెప్పారు. ఈ నెల 19న ఇంగ్లీషు, తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో లయన్ కింగ్ రిలీజ్ కానుంది.

Latest Updates