తెలంగాణలోని ఓ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న ప్రభాస్

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణలోని ఓ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే ఆయన సోమవారం ఓ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నాడు. హైదరాబాద్ ఓఆర్ఆర్ కి దగ్గరలో ఉన్న ఖాజిపల్లె అనే ఈ గ్రామంలోని అర్బన్ బ్లాక్ ని దత్తత తీసుకున్నాడు ప్రభాస్. 1,650 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త తీసుకొని త‌న తండ్రి పేరిట అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు తెలిపిన ప్రభాస్.. త‌క్ష‌ణ సాయంగా రూ.2 కోట్లు అంద‌జేశాడు.‌  అవ‌స‌రాన్ని బ‌ట్టి మ‌రింత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించాడు.  ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ లు పాల్గొన్నారు.

ఇటీవల ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రభాస్ పాల్గొన్న సంగతి తెలిసిందే. పెదనాన్న కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్ తన ఇంట్లో మూడు మొక్కలు నాటి ఒక వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ని దత్తత తీసుకుంటానని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.గ్రీన్ ఇండియా చాలెంజ్ సమయంలో ఎంపీ సంతోష్ కుమార్ ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నానని ప్రభాస్ ట్వీట్ చేశాడు.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి రాధాకృష్ణ డైరెక్టర్. 1920 ప్యారిస్ బ్యాగ్రౌండ్‌తో సాగే సీన్‌ల‌కు సంబంధించిన షూటింగ్‌కు ప్ర‌భాస్ సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మ‌రో బిగ్ ప్రాజెక్ట్ లో  ప్ర‌భాస్ హీరోగా న‌టించ‌నున్నాడు. ఆ త‌ర్వాత బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ డైరెక్ష‌న్‌లో ఆదిపురుష్ అనే భారీ సినిమాలో రాముడిగా ప్ర‌భాస్ న‌డించ‌నున్న విషయం తెలిసిందే.

Latest Updates