ఆన్ లైన్ క్లాసుల పేరుతో భారీగా ఫీజులు .. డీఈవోకు ఫిర్యాదు చేసిన శివబాలాజీ

రంగారెడ్డి జిల్లా: కార్పొరేట్, ప్రయివేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసుల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని రంగారెడ్డి జిల్లా డీఈవోకు ఫిర్యాదు చేశాడు నటుడు శివ బాలాజీ. హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లీటేరాజీ స్కూల్.. తన పిల్లలను ఎలాంటి సమాచారం లేకుండా ఆన్ లైన్ క్లాసెస్ నుండి తొలిగించడంపై గతంలో హెచ్చార్సీకి ఫిర్యాదు చేసినట్లు శివబాలాజీ దంపతులు తెలిపారు. స్కూల్ యాజమాన్యం ఆన్ లైన్ క్లాసెస్ పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని… డీఈవో విజయలక్ష్మికి వివరించారు. పెంచిన స్కూల్ ఫీజలు తగ్గించాలని కోరితే తమకు ఎలాంటి సమాచారం లేకుండా… తమ పిల్లలను తొలగించారని చెప్పారు. తమలాగే అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

స్కూల్ యాజమాన్యం విద్యార్థుల పట్ల ఈ విధానంగా వ్యవహరించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాము హెచ్చార్సీలో ఫిర్యాదు అనంతరం…. తమ పిల్లలకు తిరిగి ఆన్ లైన్ క్లాస్ లకు యాక్సెస్ ఇచ్చారని తెలిపారు. అయితే అకారణంగా ఆన్ లైన్ క్లాస్ ల నుండి ఎందుకు తొలిగించారని స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే… టెక్నికల్ ప్రాబ్లమ్ అంటూ నిర్లక్ష్యంగా జవాబు ఇస్తున్నారని తెలిపారు.  మౌంట్ లీటేరాజీ  స్కూల్ రూల్స్ కు విరుద్ధంగా వసూళ్లు చేస్తున్న ఫీజుల విషయం… ఆన్ లైన్ క్లాసుల నిర్వహణకు సంబంధించిన వివరాలు డీఈవోకు ఇచ్చామని తెలిపారు. ఈ విషయంలో స్కూల్ గుర్తింపు రద్దు అయ్యేవరకు తాము పోరాడుతామన్నారు.

శివ బాలాజీ చేసిన ఫిర్యాదుపై ఇదివరకే HRC స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దర్యాప్తు చేయమని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డీఈఓకి నోటీసులు జారీ చేసింది HRC.

Latest Updates