ఆ దర్శకుడితో హ్యాట్రిక్ కొడతాడా?

ఒక హీరో ఒకే దర్శకుడితో రెండు మూడు సినిమాలు చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ కెరీర్‌‌ ప్రారంభంలోనే, అది కూడా అతి తక్కువ గ్యాప్​లో చేస్తే మాత్రం  విశేషమే. విజయ్ దేవరకొండ విషయంలో అదే జరిగేలా ఉంది. ప్రస్తుతం చేతినిండా సినిమా లతో యమ బిజీగా ఉన్నాడు విజయ్. అయినా కూడా అతడితో సినిమా తీయడానికి చాలామంది దర్శకులు ట్రై చేస్తూనే ఉన్నారు. వారిలో నాగ్ అశ్విన్‌ కూడా ఉన్నాడని, అయితే మిగతా వారిలా ప్రయత్నాల దగ్గరే ఆగిపోలేదని, ఇప్పటికే తన కథకి విజయ్‌ని ఒప్పించేశాడని ప్రచారం జరుగుతోంది.

ఆల్రెడీ వీళ్లిద్దరూ కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాలకు పని చేశారు. ఆ రెండూ మంచి చిత్రాలే. విజయ్‌ కెరీర్‌‌కి ఎంతో ఉపయోగపడినవే. అందుకే అశ్విన్‌తో పని చేయడానికి విజయ్ కూడా చాలా ఇష్టపడుతున్నాడట. ఆల్రెడీ అశ్విన్ స్క్రిప్ట్ వర్క్‌ మీద ఉన్నాడట. ప్రస్తుతం ఉన్న కమిట్‌మెంట్స్ కంప్లీట్ చేసి, విజయ్ కాస్త ఫ్రీ అవ్వగానే వీళ్లిద్దరి మూవీ మొదలవుతుందనే వార్త బలంగా వినిపిస్తోంది. అదే నిజమైతే వీళ్ల కాంబినేషన్‌లో మూడో సినిమా చూడటానికి ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. మరి ఇది నిజమవుతుందా, గత చిత్రాల మాదిరిగానే ఈసారీ ఓ మంచి సినిమాతో వచ్చి వీళ్లు హ్యాట్రిక్ కొడతారా అనేది చూడాలి.

Latest Updates