ఆదర్శ్ క్రెడిట్ సొసైటీ నుంచి అసలు రాదు..వడ్డీ లేదు

రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన ఆఫీసులు

30వేల సభ్యుల నుంచి 150 కోట్ల డిపాజిట్లు

యాజమాన్యంపై  క్రిమినల్ కేసులు

సంస్థ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ

ఆందోళనలో వేలాది డిపాజిటర్లు

మంచిర్యాల, వెలుగు: 800కు పైగా బ్రాంచీలు.. 20 లక్షలకు పైగా మెంబర్లు.. 3.7 లక్షలకు పైగా ఇన్వెస్టర్లు.. రూ.9 వేల కోట్లకు పైగా డిపాజిట్లతో దేశవ్యాప్తంగా విస్తరించిన ‘ఆదర్శ్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’లో నెలకొన్న సంక్షోభం తెలంగాణనూ తాకింది.  రాష్ర్టంలోనూ 30వేలకు పైగా సభ్యులుండగా, సుమారు రూ.150 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అధిక వడ్డీ ఆశతో టర్మ్ డిపాజిట్లు చేసినవారంతా ప్రస్తుతం అసలుకూ గ్యారెంటీ లేక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మెచ్యూరిటీ గడువు ముగిసినప్పటికీ డబ్బులు చేతికి రాక ఇబ్బందులు పడుతున్నారు. బ్రాంచి ఆఫీసులు మూతపడడం, మేనేజర్ల ఫోన్లు స్విచ్ఛాప్ వస్తుండడంతో ఎవరిని అడగాలో తెలియక ఆందోళనచెందుతున్నారు.

నార్త్ ఇండియాలో కేసులు..

ఆదర్శ్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సంస్థ యాజమాన్యం డిపాజిట్లను దుర్వినియోగం చేసిందనే ఆరోపణలతో రాజస్థాన్ రాష్ర్టంలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. రాజస్థాన్, హర్యానా, న్యూఢిల్లీ, గుజరాత్, మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో సంస్థకున్న రూ.1489 కోట్ల ఆస్తులను నిరుడు అక్టోబర్లో అటాచ్డ్ చేసింది. గత ఏడాదిన్నర కాలంగా ఈ సంక్షోభం కొనసాగుతుండడంతో ఆ ఎఫెక్ట్ తాజాగా తెలంగాణపై పడింది.

తెలుగు రాష్ట్రాల్లో మూతపడ్డ ఆఫీసులు..

ఈ సంస్థకు రాష్ర్టంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, జగిత్యాల, గోదావరిఖని, మంచిర్యాల, చెన్నూర్, కాగజ్ నగర్ తోపాటు రెండు తెలుగు రాష్ర్టాల్లో సుమారు 65 బ్రాంచిలు ఉన్నాయి. వీటిలో జనవరి నుంచి లావాదేవీలు నిలిచిపోయాయి. చాలా మంది స్టాఫ్ రిజైన్ చేసి వెళ్లిపోయారు. పలుచోట్ల నాలుగు నెలల నుంచి ఆఫీసులు మూతపడ్డాయి. దీంతో పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయో లేదోనని డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ర్టంలో 30వేలకు పైగా సభ్యులు ఉండగా, రూ.150 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు సమాచారం. ఒక్క మంచిర్యాల బ్రాంచిలోనే సుమారు 2 వేల మంది మెంబర్లు, రూ.20 కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నట్లు తెలిసింది. అధిక వడ్డీ ఆశచూపడం వల్ల వేలాది మంది వెనుకాముందు ఆలోచించకుండా ఇందులో లక్షలు, కోట్లలో డిపాజిట్లు చేశారు. టర్మ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 14 శాతం వడ్డీ ఇస్తామనడంతో ఉద్యోగులు, వ్యాపారులు భవిష్యత్ అవసరాల దృష్ట్యా పెట్టుబడులు పెట్టారు. మెచ్యూరిటీ గడువు ముగిసినప్పటికీ డబ్బులు చేతికి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు.

ఆఫీసులు, ఠాణాల చుట్టూ డిపాజిటర్లు..

ఎక్కడికక్కడ లోకల్ గా ఉన్న బిజినెస్ అడ్వైజర్ల మాటలు నమ్మి మోసపోయామని డిపాజిటర్లు వాపోతున్నారు. కొంతమంది తమ డబ్బులు ఇప్పించాలని కోరుతూ పోలీస్ స్టేషన్ల చుట్టూ, పొలికల్ లీడర్ల చుట్టూ తిరుగుతున్నారు. కానీ కోర్టు కేసుల కారణంగా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఆఫీసులు కూడా మూతపడడంతో వారికి కనీసం సమాచారం ఇచ్చేవారు కరువయ్యారు. ఎవరికి ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తోందని చెబుతున్నారు. ‘డిపాజిట్ల విషయంలో సంస్థ యాజమాన్యం ఫ్రాడింగ్ చేసిందని రాజస్థాన్ రాష్ర్టంలో కేసులు నమోదయ్యాయి.. కోర్టులో కేసులు నడుస్తున్నాయి.. జనవరి నుంచి లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి.. ’ అని  సంస్థ ఉద్యోగి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్ను లిక్విడేటర్ గా నియమించిందనీ, ఈ నెలాఖరు వరకు ట్రాన్జాక్షన్స్ కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చే  అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత డిపాజిటర్లకు చెల్లింపులు చేసే చాన్స్ ఉందని చెప్పారు. దీనిపై మరింత క్లారిటీ కోసం వరంగల్ రీజినల్ మేనేజర్ శర్మను, హైదరాబాద్ జోనల్ మేనేజర్ రవీంద్రకుమార్ ను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి.

ఆర్నెల్ల నుంచి తిరుగుతున్నా..

నేను ఆదర్శ్ క్రెడిట్ సొసైటీల రూ.15 లక్షలు డిపాజిట్ చేసిన. ఒకటి జనవరిలో, ఇంకోటి ఏప్రిల్లో  మె చ్యూరిటీ అయ్యింది. ఆర్నెల్ల నుంచి పైసల కోసం తిరుగుతున్న. ఆఫీసు బంద్ ఉన్నది. వచ్చే నెలలో బిడ్డ పెళ్లి పెట్టుకున్న. ఈ పైసలు రాకుంటే చాలా తక్లీబ్ అయితది. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు కూడా పుడ్తలేదు. ఏం జేయాల్నో అర్థమైతలేదు.

సలీమ్, డిపాజిటర్, మంచిర్యాల

డిపాజిటర్లు ప్రెజర్ చేస్తుండ్రు..

నేను మంచిర్యాలలో ఆదర్శ్ క్రెడిట్ సొసైటీకి అడ్వైజర్గా చేరిన. వడ్డీ రేటు ఎక్కువగా ఇస్తున్నరని చెప్పి మా అన్నతోటి రూ.5లక్షలు డిపాజిట్ చేయించిన. జనవరి నుంచి నెలనెల వడ్డీ ఇస్తలేరు. ఆయన అడుగుతున్నడు. ఆఫీసుకు పోతే తాళం ఉన్నది. ఇన్ఫర్మేషన్ ఇచ్చెటోళ్లు కూడా లేరు. ఇట్లనే చాలా మంది అడ్వైజర్లను డిపాజిటర్లు ప్రెజర్ చేస్తుండ్రు.

కిష్టయ్య, అడ్వైజర్, మంచిర్యాల

Latest Updates