అఫిడవిట్లు ఇచ్చుడేంది?.. రాష్ట్ర కాంగ్రెస్ లో లొల్లి

పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కొత్తగా ప్రవేశపెట్టిన అఫిడవిట్ల వ్యవహారం నేతల మధ్య విభేదాలకు కారణమవుతోంది. పార్టీ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ టికెట్లు ఆశించేవారు ముందుగా 20 రూపాయల బాండ్​ పేపర్ పై ‘‘నేను పార్టీని వీడను. ఒక వేళ వీడితే ఈ పదవికి అనర్హుడిగా గుర్తించాలి. నాపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి” అంటూ అఫిడవిట్ ఇవ్వాల్సిఉంది. అఫిడవిట్ సమర్పించిన వారికే పరిషత్​ టికెట్ ఇస్తున్నారు. ఈవిధానంపై జిల్లాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నామని, అలాంటి తమపై నమ్మకం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంతో జనంలో  చులకనవుతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యేల ఫిరాయింపు దృష్ట్యా..
కాం గ్రెస్  ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీ ఫిరాయిస్తుండటంతో పరిషత్ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి ఎదురుకావొద్దని అఫిడవిట్ల అంశాన్ని ఇటీవల పీసీసీ తెరమీదికి తెచ్చింది. అఫిడవిట్ తీసుకున్న తర్వాత నేబీ ఫామ్ లు ఇవ్వాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశారు. గత రెండు రోజలుగా రాష్ట్రవ్యా ప్తంగా అన్ని జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులు తమ పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు బీ ఫామ్ లను పంపిణీ చేస్తున్నారు.

పీసీసీ ఆదేశాలను అమలుచేస్తున్న డీసీసీ అధ్యక్షులకు అభ్యర్థుల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. అఫిడవిట్ వ్యవహారం తమను అనుమానించే రీతిలో ఉందని, తాము ఏమైనా అమ్ముడుపోయే వాళ్లలా కనిపిస్తున్నామా అని పలు జిల్లాల్లో డీసీసీ అధ్యక్షులను ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అఫిడవిట్ ఇస్తేనే బీ ఫామ్ఇస్తామని డీసీసీ అధ్యక్షులు తేల్చి చెప్తున్నారు. దీంతోఅభ్యర్థులకు, డీసీసీ అధ్యక్షులకు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.

పీసీసీకి ఫిర్యాదులు
పరిషత్ అభ్యర్థులు లేవనెత్తుతున్న అభ్యం తరాలపై పీసీసీ నేతలకు డీసీసీ అధ్యక్షులు ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు సైతం అఫిడవిట్ల వ్యవహారం తమను నలుగురి ముందు అవమాన పరిచేలా ఉందని, ఇది పార్టీకి మేలు కన్నా కీడే ఎక్కువగా చేసేలా ఉందని పీసీసీ దృష్టికి తెస్తున్నారు. రామగుండం మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ అభ్యర్థి పీపీసీ నేతలకు ఫిర్యాదు కూడా చేశారు.‘‘ఇలాంటి అఫిడవిట్లతో ప్రజల్లో మేము చులకనైపోతాం.

సొంత పార్టీ మిమ్మల్ని నమ్మకుండా అఫిడవిట్ చేసుకోగా, మేమెలా నమ్మాలని జనం అడిగితే ఏంజవాబు చెప్పాలి” అని ధర్మపురి ప్రాంతానికి చెందిన ఓ ఎంపీటీసీ అభ్యర్థి అక్కడి డీసీసీ అధ్యక్షుడ్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాజకీయ వ్యవస్థలో ఏ పార్టీ అమలుచేయని అఫిడవిట్ల విధానాన్ని ఎంతో చరిత్ర ఉన్న తమ పార్టీ అమలుచేయడం ఆశ్చర్యంగా ఉందని రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, జడ్పీటీసీ అభ్యర్థి అన్నారు. ఇలాంటివి ధానం ప్రత్యర్థులకు అవకాశంగా మారుతుందని, మరీ ము ఖ్యంగా ఎన్నికల సమయంలో జనంలో తాము డ్యామేజీ అవుతామని సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ జడ్పీటీసీ అభ్యర్థి  ఆవేదనను వ్యక్తం చేశారు.

పెద్దపల్లి, కరీంనగర్ , సిరిసిల్ల జిల్లాలకు చెందిన డీసీసీ అధ్యక్షులు ఈర్ల కొంరయ్య, మృత్యుంజయం, నాగుల సత్యనారాయణ గౌడ్  కూడా ఈ అఫిడవిట్లతో అభ్యర్థుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్టీ  రాష్ట్ర నేతలకు వివరించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారని గ్రామీణ ప్రాంతాల కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే రీతిలో ఇలాంటి అఫిడవిట్లు స్వీకరించడం మంచి పద్ధతి కాదని ఓ నాయకుడు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. కొందరు అభ్యర్థులైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి అఫిడవిట్లను ముందే సిద్ధం చేసుకొని వాటిని డీసీసీ అధ్యక్షులకు అందజేస్తూ బీ ఫామ్ లు అందుకుంటున్నారు.

Latest Updates