మాటలు మరింత ఖరీదు: టారిఫ్ పెంచుతామంటున్న జియో

  • ఎయిర్‌టెల్, ఐడియా ప్రకటనతో మళ్లీ బాదుడుకు రెడీ అయిన జియో

ఇక ఫోన్‌లో మాటలు మరింత ఖరీదు కాబోతున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా తమ టారిఫ్‌లు పెంచబోతున్నట్లు ప్రకటించాయి. ఎంత పెంచుతున్నామన్నది చెప్పలేదు కానీ, డిసెంబరు 1 నుంచి కొత్త టారిఫ్‌లు వస్తాయని తెలిపాయి. సెప్టెంబర్‌లో లాభనష్టాల ప్రకటన సందర్భంగా 23 వేల కోట్ల నష్టంలో ఉన్నామని భారతీ ఎయిర్‌టెల్, 50 వేల కోట్లపైన నష్టంలో ఉన్నామని వొడాఫోన్-ఐడియా తెలిపాయి. ఆ నష్టాల నుంచి కోలుకోవడానికి కాల్ టారిఫ్ పెంచబోతున్నామని ప్రకటించాయి.

ఆ రెండు కంపెనీల బాటలోనే రిలయన్స్ జియో కూడా టారిఫ్ పెంపుకు సిద్ధమైంది. ఫ్రీగా మాట్లాడుకునే స్వేచ్ఛ అని చెప్పిన ఈ కంపెనీ ఇప్పటికే ఇంటర్‌కనెక్ట్ యూజర్ చార్జీల పేరుతో వేరే నెట్‌వర్క్‌కి చేసే కాల్స్‌పై చార్జీలు వసూలు చేస్తోంది. ఇప్పుడు పోటీ కంపెనీలు ఎయిర్‌టెల్, ఐడియా టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటించగానే జియో కూడా రెడీ అయిపోయింది. ప్రభుత్వం, ట్రాయ్‌తో చర్చించి, ఇతర కంపెనీల్లా తాము కూడా కాల్ టారిఫ్ పెంచుతామని ప్రకటించింది. టెలికాం రంగాన్ని బలోపేతం చేసేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, కస్టమర్లకు ఇబ్బంది కలగని రీతిలో తమ పెంపు ఉంటుందని తెలిపింది జియో. డేటా వినియోగంపై ప్రభావం పడకుండా ఉండేలా తమ చర్యలు ఉంటాయని, రెండు వారాల్లో కొత్త టారిఫ్ ప్రకటిస్తామని చెప్పింది.

Latest Updates