ఏప్రిల్‌ ఒకటి తర్వాత ఆ బండ్లన్నీ స్క్రాపే

బీఎస్-4 వెహికల్స్ అమ్మకానికి డెడ్‌లైన్ 28 వరకేనా?
షోరూమ్‌లో లక్షకుపైగా వాహనాలు
మరో 2 లక్షలు వరకు టీఆర్ నంబర్ బండ్లు
ఇబ్బందుల్లేకుండా రవాణా శాఖ ఏర్పాట్లు
స్లాట్స్ పెంపు, ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు

హైదరాబాద్‌ , వెలుగు: బీఎస్‌ (భారత్‌ స్టేజ్‌ ) –4 బండ్లను ఈ నెల 28వ తేదీ వరకు మాత్రమే అమ్మేలా ఆర్టీఏ యోచిస్తోంది. ఈ మేరకు షోరూమ్‌‌లకు ఆదేశాలివ్వనుంది. 31వ వరకు సేల్స్‌ చేస్తే రిజిస్ట్రేషన్లు చేయడం కుదరదని భావిస్తోంది. దీంతో మూడు రోజులు ముందే సేల్స్‌ బంద్‌ చేయించాలని చూస్తోంది. మరోవైపు రాష్ట్రంలో టీఆర్ నంబర్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలు 2 లక్షలకు పైగా ఉన్నాయని ఆర్టీఏ అధికారులు పేర్కొంటున్నారు. వీటికి అదనంగా రెగ్యులర్‌‌ రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇంకా లక్ష వరకు వెహికల్స్‌ షోరూమ్‌‌లలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రోజు వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్ల కోసం వస్తుండటంతో ఇబ్బందులు కలగకుండా ఆర్టీఏ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

ఏప్రిల్‌ ఒకటి తర్వాత స్క్రాపే
కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా బీఎస్‌ -4 వాహనాలు బంద్‌ కానున్నయి . ఈ నెలాఖరులోగా రిజిస్ట్రేషన్‌‌ చేయించుకోకుంటే ఆ వాహనాలను స్క్రాప్‌ కింద అమ్ము కోవాల్సిందే. రిజిస్ట్రేషన్‌‌ కాని బీఎస్‌ -4 వాహనాలు ఏప్రిల్‌‌ ఒకటి నుంచి రోడ్డెక్కితే సీజ్‌ చేయనున్నారు. రిజిస్ర్టేషన్‌‌ కోసం దరఖాస్తు చేసుకున్న కొన్ని వాహనాలకు వివిధ కారణాల వల్ల రిజిస్ర్టేషన్‌‌ కాకుండా పెండింగ్‌‌లో ఉన్నాయి. ఎంవీఐకి వాహనాన్ని చూపించకపోవడం, రెండో వాహనానికి సంబంధించి ట్యాక్స్‌ చెల్లించక, ఇంకొందరు అప్లికేషన్‌‌ ఫాం ఇచ్చి ఫొటో దిగకుండా వెళ్లిపోవడం వంటి కారణాల వల్ల రిజిస్ట్రేషన్‌‌ కాకుండా పెండింగ్‌‌లో ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర నిబంధనలతో తప్పనిసరి కావడంతో వాహనదారులు బండ్ల రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. బండ్ల రిజిస్ట్రేషన్ల కోసం వాహనదారులు ఆర్టీఏ ఆఫీసుల వద్ద క్యూలు కడుతున్నరు. ఈ నెల ఒకటో తేదీ నాటికి 2.5 లక్షల టీఆర్‌‌ వాహనాలు ఉండగా.. ప్రస్తుతం 2 లక్షలకు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో హైదరాబాద్‌‌లోనే 10వేల రిజిస్ట్రేషన్లు అయ్యాయి . హైదరాబాద్‌‌లో ఇంకా 20వేల బండ్లు ఉన్నాయి. నిత్యం 700 వరకు రిజిస్ట్రేషన్‌‌ కాగా, ఇప్పుడు 1500 వరకు రిజిస్టర్‌‌ అవుతున్నాయి. జిల్లాల్లో గతంలో 70 వరకు రిజిస్ట్రేషన్‌‌ కాగా, ప్రస్తుతం 300 వరకు చేస్తున్నారు. కాగా సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు మరింత ఊపందుకునే అవకాశం ఉండడంతో 28వ తేదీ వరకే బండ్లను అమ్మాలని షోరూమ్‌‌లకు ఆదేశాలు ఇవ్వాలని ఆర్టీఏ యోచిస్తోంది.

డబులైన రిజిస్ట్రేషన్లు
బండ్ల రిజిస్ట్రేషన్‌‌ కోసం వాహనదారులు ఆర్టీఏ ఆఫీసులకు రావడంతో ఇబ్బందులు తప్పలేదు. రెగ్యులర్‌‌ కంటే డబుల్‌‌ కావడంతో గంటల తరబడి నిరీక్షణ తప్పలేదు. గడువు సమీపిస్తుండటం, వాహనదారుల సంఖ్య పెరగడంతో ఆర్టీఏ ప్రత్యేక చర్యలు తీసుకుంది. స్లాట్స్‌ డబుల్‌‌ చేసింది. హైదరాబాద్‌ లాంటి చోట్ల గతంలో రోజుకు వెయ్యి స్లాట్స్‌ మాత్రమే ఉండగా, ఇప్పుడు 2వేలకు పెంచింది. ఆర్టీఏ ఆఫీసుల్లో కౌంటర్లు కూడా పెంచింది. ఒక్కో ఆఫీస్‌‌లో రెండు నుంచి మూడు కౌంటర్లు అదనంగా ఏర్పాటు చేసింది. సమయ వేళలు కూడా పెంచింది. రిజిస్ట్రేషన్‌‌ కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండగా, ప్రస్తుతం 5 గంటల వరకు పొడిగించింది. ఈ సమయం నెలాఖరులో మరింత పెంచే అవకాశం ఉంది. అంతేకాకుండా టీఆర్‌‌ నంబర్‌‌ తీసుకుని, పర్మినెంట్‌‌ రిజిస్ట్రేషన్‌‌ తీసుకోని వారికి ఆర్టీఏ అధికారులు ఫోన్లు చేస్తున్నారు. మరికొందరికి ఎస్‌ఎంఎస్‌‌లు పంపుతున్నారు. ఇప్పటికే డీలర్స్‌‌తో సమావేశం నిర్వహించింది. వారితో ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంది.

స్పెషల్‌ అరేంజ్‌‌మెంట్స్‌‌ చేసినం..
ఈ నెలాఖరులోగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నం. ఇప్పటికే ఆర్టీఏ ఆఫీస్‌‌లలో స్లాట్స్‌‌,
కౌంటర్లు పెంచాం. టైమింగ్స్‌‌ కూడా సాయంత్రం 5గంటల వరకు పొడిగించాం. డీలర్లతో సమావేశం పెట్టి, వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించాం. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వీలైనంత వరకు తొందరగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

– పాండు రంగానాయక్‌ ,
జాయింట్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ కమిషనర్‌‌రేపు

For More News..

కరోనాపై ఇండియన్ డాక్టర్ల ముందడుగు

గుజరాత్‌‌లో కాంగ్రెస్‌‌కు షాక్‌.. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా

మే నుంచి కరెంట్ బిల్లుల పెంపు.. మధ్య తరగతిపై భారం

గుడ్‌న్యూస్.. కరోనా టెస్టులు ఫ్రీ

కట్నం కోసం కరోనా వేధింపులు

Latest Updates