ఖుషీతో సంబరాలు చేసుకున్నారు

నిర్భయ కేసులో దోషులను ఉరి తీశాక, పాట్నా అమ్మాయిలు ఇలా రంగులు చల్లుకున్నారు. ఆ నలుగురిని ఉరితీస్తారన్న సమాచారంతో తీహార్ జైలు దగ్గరికి జనం భారీగా తరలివచ్చారు. నిర్భయ దోషులను ఉరి తీశామని జైలు అధికారులు ప్రకటించగానే సంబరాలు చేసుకున్నారు. అక్కడే కాదు, దేశంలో అనేక చోట్ల ఇలాంటి సెలబ్రేషన్స్​ కనిపించాయి. ముఖ్యంగా చదువుకుంటున్న అమ్మాయిలు స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని షేర్​ చేసుకున్నారు.

న్యూఢిల్లీశుక్రవారం ఉదయం 5:30 గంటలకు నిర్భయ దోషులను ఉరితీస్తారని కన్ఫార్మ్​ అయ్యాక  తీహార్​ జైలు దగ్గరికి వందలాదిగా జనం చేరుకున్నారు. అక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ ఆనందం..  రేప్​చేసి, పాశవికంగా  హింసించి నిర్భయ చనిపోవడానికి కారణమైన దుర్మార్గులను ఉరితీస్తున్నారన్న సంబరం వాళ్ల ముఖాల్లో కనిపించింది. కరోనా వైరస్​ ముప్పు పొంచి ఉందని…  ఎక్కువ మంది గుమికూడవద్దని హెచ్చరికలున్నా వాళ్లు అవేమీ పట్టించుకోలేదు. జనం భారీగా రావడంతో సెక్యూరిటీని కూడా పెంచారు.  ఇంతలోనే  నిర్భయ దోషులు నలుగురిని ఉరి తీశామని జైలు అధికారులు  ప్రకటించారు..

‘‘లాంగ్​లివ్​ నిర్భయ, భారత్​ మాతాకీ జై”  నినాదాలతో తీహార్​ జైలు పరిసరాలు మార్మోగిపోయాయి. ఆనందంతో  అక్కడికి చేరుకున్నవాళ్లు  స్వీట్లు పంచుకున్నారు. దుర్మార్గులకు తగిన శిక్ష పడిందని డ్యాన్సులు చేశారు. జెండాలు ఊపుతూ దేశభక్తి గీతాలు పాడారు. నిర్భయ ఆత్మ శాంతించాలని కోరుకున్నారు. ఈ సంబరాలను నిర్భయ పేరెంట్స్​, వాళ్ల లాయర్లు చూశారు. దూరం నుంచే జనానికి విక్టరీ సింబల్​ చూపించారు. “న్యాయం జరిగేవరకు మాకు సపోర్ట్​  చేసినందుకు థ్యాంక్స్” అంటూ  నిర్భయ పేరెంట్స్​ కన్నీటి పర్యంత మయ్యారు. తిలక్​నగర్​కు చెందిన తొమ్మిదేళ్ల జినిషా కౌర్​ … తండ్రితో వచ్చి అక్కడ నెలకొన్న ఆనందకర వాతావరణాన్ని చూసి హ్యాపీ ఫీలయింది. ఏడేళ్ల న్యాయపోరాటంలో సాధించిన ఘన విజయాన్ని కళ్లారా చూద్దామని తీహార్​ జైలు దగ్గరకు వచ్చినట్టు నిర్భయ కుటుంబానికి క్లోజ్​గా ఉన్న
ఆకాశ్​ దీప్​ చెప్పారు.

పూర్వీకుల ఊరిలోనూ సంబరాలే…

శుక్రవారం ఉదయాన్ని దోషులను ఉరితీశారన్న వార్త విన్న నిర్భయ పూర్వీకుల ఊరు  ఉత్తరప్రదేశ్​ బలియా జిల్లాలోని మెడ్వారా కాలాలో సంబురాలు  జరుపుకున్నారు.  గ్రామమంతా వాళ్ల పూర్వీకుల ఇంటికి తరలి వచ్చింది.  యువకులు ఆనందంతో డ్యాన్స్​లు చేశారు.  “మార్చి 20 ని నిర్భయ దివస్​గా జరుపుకోవాలి.  కరోనా కన్నా దోషులు ప్రమాదకరమైనవాళ్లు. వాళ్లను ఉరితీయడం హ్యాపీగా ఉంది”అని నిర్భయ తాత లాల్జీసింగ్​ చెప్పారు.

న్యాయం గెలిచింది: ప్రధాని

‘న్యాయం గెలిచింది. మహిళల గౌరవం, భద్రతకు ప్రత్యేక గుర్తింపునివ్వాల్సిన సందర్భం వచ్చింది’ అంటూ నిర్భయ కేసును ప్రస్తావించకుండానే దోషుల ఉరితీతను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్​ చేశారు.

ఆలస్యమైనా చివరకు న్యాయం జరిగింది: ఆశాదేవి

ఈ రోజు కోసం మనమంతా చాలా ఎదురుచూశాం. ఇన్నాళ్లకు నా కూతురికి న్యాయం జరిగింది. ఈనాటి సూర్యోదయం నా కూతురితో పాటు దేశంలోని మిగతా వారికీ కొత్త ఉదయం.. అంటూ నిర్భయ తల్లి ఆశాదేవి చెప్పారు. ఆలస్యం జరిగినా చివరకు న్యాయం జరిగిందని అన్నారు.

 

2012 డిసెంబర్​ 16 -ఆ రోజు ఏం జరిగిందంటే..

అర్ధరాత్రి ఢిల్లీ రోడ్లపై పరుగులు పెడుతున్న బస్సులో నిర్భయపై ఆరుగురు నిందితులు దారుణంగా అత్యాచారం చేశారు. ఆ రోజు నిర్భయ తన స్నేహితుడితో కలిసి సినిమాకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్లేందుకు ప్రైవేటు మినీ బస్సులో ఎక్కారు. బస్సులో ఎవరూ లేకపోవడంతో డ్రైవర్, అతడి స్నేహితులు ఆరుగురు నిర్భయ స్నేహితుడిని కొట్టి, ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె శరీరంలోకి ఇనుప చువ్వలను గుచ్చి హింసించారు. నిర్మానుష్యంగా ఉన్నచోట ఇద్దరినీ పడేసి వెళ్లిపోయారు. పోలీసులు వారిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. పన్నెండు రోజుల పాటు చావుబతుకుల మధ్య కొట్టాడిన నిర్భయ.. చివరకు సింగపూర్​ ఆస్పత్రిలో చనిపోయింది.

Latest Updates