కరోనా పోయిన తర్వాత.. ప్రపంచం టెక్నాలజీదే

స్టూడెంట్లు ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి
ఐఐటీ ఢిల్లీ కాన్వొకేషన్ లో ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: కరోనా తర్వాత ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అందులో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. శనివారం ఐఐటీ ఢిల్లీ 51వ కాన్వొకేషన్ నిర్వహించగా, ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని మోడీ అన్నారు. గ్లోబలైజేషన్ తో పాటు సెల్ఫ్ రిలయన్స్ కూడా ముఖ్యమని తెలియజేసిందన్నారు. గత కొన్నేండ్లలో దేశంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. తద్వారా దేశంలోని ప్రజలందరికీ సేవలు అందుతున్నాయని, కరప్షన్ కూడా తగ్గిందని చెప్పారు.

మీరే బ్రాండ్ అంబాసిడర్లు…

యువత ఈజీగా బిజినెస్ చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు. స్టూడెంట్లు ఆవిష్కరణలపై దృష్టిసారించాలని సూచించారు. పేదలకు ఉపయోగపడే ఆవిష్కరణలు చేయాలన్నారు. ‘‘మీ ఆవిష్కరణలతో మన ప్రొడక్టులకు ప్రపంచ గుర్తింపును తీసుకురావాలి. బ్రాండ్ ఇండియాకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు” అని మోడీ స్టూడెంట్లతో అన్నారు. ‘‘మా టైమ్ లోనే కరోనా ఎందుకు వచ్చిందని మీరు నిరాశ చెందొచ్చు. కానీ కొంచెం విభిన్నంగా ఆలోచించండి. కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేయండి. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఇప్పటికే కొన్ని ఆవిష్కరణలు పురుడు పోసుకున్నాయి” అని మోడీ చెప్పారు. కాన్వొకేషన్ వచ్చినంత మాత్రాన ఎడ్యుకేషన్ అయిపోయినట్టు కాదని, స్టూడెంట్లు జాబ్ లో చేరేందుకు ఇదొక పునాది లాంటిదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ప్రపంచంలోనే అతిపెద్ద సంస్కరణగా పేర్కొన్నారు.

ఓఆర్‌‌ఓపీ చారిత్రాత్మక నిర్ణయం

కేంద్రం ప్రవేశపెట్టిన వన్‌ ర్యాంక్‌ వన్‌ పింఛన్‌ (ఓర్‌‌ఓపీ) స్కీమ్ చరిత్రాత్మక నిర్ణయమని మోడీ అన్నారు. ఆ స్కీమ్ ను ప్రారంభించి ఐదేండ్లయిన సందర్భంగా శనివారం ఆయన ట్వీట్ చేశారు. “ దేశాన్ని రక్షించే సైనికులకు మంచి జరిగేలా ఐదేండ్ల కిందట మన దేశం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఓఆర్‌‌ఓపీ కోసం సైనికులు కొన్నేండ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. సైనికుల అద్భుతమైన సేవలకు సెల్యూట్’ అని పేర్కొన్నారు. డిఫెన్స్‌ మినిస్ట్రీ తీసుకున్న నిర్ణయాలను హైలైట్‌ చేస్తూ మోడీ మరో ట్వీట్ చేశారు.

 

Latest Updates